బద్వేల్ మున్సిపాలిటీగా ఏర్పడి 15 సంవత్సరాలు పూర్తవుతున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని సీపీఐ పట్టణ కార్యదర్శి బాలు విమర్శించారు. పంచాయతీగా ఉన్నప్పుడే పట్టణంలో మెరుగైన అభివృద్ధి కనిపించేదని ఆయన పేర్కొన్నారు. బద్వేల్ జేవీ భవన్‌లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మున్సిపాలిటీ అభివృద్ధి పేరుతో రూ.130 కోట్లు, రూ.100 కోట్లు, ఇటీవల పట్టణ సుందరీకరణ కోసం రూ.32 కోట్లు ఖర్చు చేశామని అధికారులు, పాలకపక్షం చెబుతున్నప్పటికీ, ఆ నిధులు ఎక్కడ, ఎలా ఖర్చు చేశారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.
వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెబుతున్నప్పటికీ పట్టణంలో చిల్డ్రన్స్ పార్క్, మినీ స్టేడియం, వాకింగ్ ట్రాక్ వంటి మౌలిక సదుపాయాలు కనిపించడం లేదని బాలు ప్రశ్నించారు. బద్వేల్ అభివృద్ధిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.