సూర్యాపేటలో ప్రభుత్వ ధాన్యం అక్రమాలపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నల్గొండ జిల్లా విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, సూర్యాపేట జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారుల సంయుక్త బృందం జూలై 20న సూర్యాపేట మండలం బాలెంల గ్రామంలోని వజ్ర రైస్ కార్పొరేషన్ మరియు వజ్ర వికాస్ రైస్ మార్ట్ రైస్ మిల్లులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.
తనిఖీల్లో భాగంగా వజ్ర వికాస్ రైస్ మార్ట్ నుంచి భారత ఆహార సంస్థ (FCI)కు సరఫరా చేయాల్సిన బియ్యాన్ని ముదిగొండలోని సత్యసాయి రైస్ కార్పొరేషన్ పేరుతో లారీల్లో లోడ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
వెంటనే ఆ ప్రక్రియను నిలిపివేసిన అధికారులు సంబంధిత లారీలు, బియ్యం నిల్వలు మరియు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.