నిరసనలో పోలీసులపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. “ప్రభుత్వాన్ని తొలగించాలని చెవిలో చెప్పారు”

కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ఎదుట నిర్వహించిన నిరసన సందర్భంగా జరిగిన ఘటనలపై స్పందించారు. నిరసన సమయంలో పోలీసులు తనను అక్కడి నుంచి తీసుకెళ్తుండగా, కొందరు పోలీసులు తన చెవిలో “ఈ ప్రభుత్వాన్ని తొలగించాలి” అని గుసగుసలాడారని ఆయన పేర్కొన్నారు. తనతో ప్రభుత్వం ఎలా ప్రవర్తించిందన్న దానికంటే, విద్యార్థుల సమస్యలే ముఖ్యమని, వారి డిమాండ్లకు తాము అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.

నిరసన సందర్భంగా పోలీసులు తనను కొంతదూరం ఈడ్చుకెళ్లిన విషయం నిజమేనని రాహుల్ గాంధీ చెప్పారు. ఆ సమయంలో రాజస్థాన్, హర్యానాకు చెందిన కొందరు పోలీసు సిబ్బంది తాము కేవలం యూనిఫాం మాత్రమే ధరించామని, తమ వ్యక్తిగత అభిప్రాయాలు వేరుగా ఉన్నాయని చెప్పారని ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

అలాగే నిరసనలో తన నోటి నుంచి రక్తం వచ్చినప్పటికీ, విద్యార్థుల హక్కుల కోసం వెనక్కి తగ్గబోమని రాహుల్ గాంధీ అన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోలీసుల్లో కూడా సానుభూతి ఉందని, వారూ విద్యార్థుల్లో తమ సొంత పిల్లలను చూసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.