హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలో ట్రాన్స్‌కో డిప్యూటీ ఇంజనీర్ ముత్యం వెంకటరమణ నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. సుమారు 12 గంటలుగా కొనసాగుతున్న ఈ తనిఖీల్లో రెండు ప్రత్యేక బృందాలు పాల్గొనగా, మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా నగదు, కీలక పత్రాలు, బంగారం, వజ్రాభరణాలు, విదేశీ మద్యం బాటిళ్లతో పాటు కియా, మహీంద్రా, బలెనో కంపెనీలకు చెందిన మూడు కార్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వెంకటరమణ రెడ్కోలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు.
సోదాల్లో వెంకటరమణ భార్య స్వప్న పేరుతో భారీ స్థాయిలో స్థిరాస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఆంజనేయనగర్, మూసాపేట్ ప్రాంతాల్లో 10 ఫ్లాట్లు, నాలుగు రెసిడెన్షియల్ ఫ్లాట్లు, G+3 కమర్షియల్ భవనాలు, అలాగే ఖానామెట్–గుట్టల బేగంపేట్ ప్రాంతంలో G+5 కమర్షియల్ భవనం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆస్తులకు సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.
అధికారుల సమాచారం ప్రకారం, 2019లో రూ.26 లక్షల లంచం తీసుకుంటూ ముత్యం వెంకటరమణ ఏసీబీకి చిక్కారు. అప్పటి నుంచి ఆయన కార్యకలాపాలపై నిఘా కొనసాగుతుండగా, విద్యుత్ శాఖలో వివిధ ప్రాంతాల్లో పనిచేసిన సమయంలో అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న ఆస్తులు, పత్రాల ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.