జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ సద్గోపన్ రమేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత టీ20 జట్టు ఎంపికలో ఐపీఎల్ ప్రదర్శనను ప్రధాన ప్రమాణంగా చెబుతున్నప్పటికీ, అదే ప్రమాణాన్ని అందరికీ సమానంగా అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు. వరుసగా 2025, 2026 ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు నుంచి ఒక్క ఆటగాడికీ అవకాశం ఇవ్వకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు.
ప్రత్యేకంగా ఐపీఎల్ 2026 సీజన్‌లో 28 వికెట్లతో రెండో అత్యధిక వికెట్లు తీసిన ఆర్సీబీ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఎంపిక కాకపోవడంపై రమేష్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అద్భుతమైన ప్రదర్శన చేసిన అనుభవజ్ఞుడైన బౌలర్‌ను పక్కన పెట్టడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
భువనేశ్వర్‌కు బదులుగా ఐపీఎల్ వికెట్ల జాబితాలో వెనుకబడిన హర్ష్ దూబే, అశోక్ శర్మ, యష్ ఠాకూర్ వంటి బౌలర్లతో పాటు, ఇటీవల పెద్దగా మ్యాచ్‌లు ఆడని మయాంక్ యాదవ్‌కు అవకాశం ఇవ్వడంపై కూడా రమేష్ విమర్శలు గుప్పించారు. జట్టు ఎంపికలో పారదర్శకత, ఒకే విధమైన ప్రమాణాలు పాటించాలని ఆయన సూచించారు.