నీట్ వివాదంపై తెలంగాణ బంద్ పిలుపు.. జూలై 24న విద్యాసంస్థలు మూసివేయాలని విద్యార్థి సంఘాల నిర్ణయం

నీట్ (NEET) పరీక్ష నిర్వహణలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న పేపర్ లీకేజీలు, అవకతవకలకు నిరసనగా విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే VBSA బిల్లు ఉపసంహరణ, ఢిల్లీలో నిరసన తెలిపిన విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలపై పారదర్శక విచారణ చేపట్టాలని కోరుతున్నాయి.

ఈ నేపథ్యంలో జూలై 24న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు SFI, AISF, NSUI, PDSU, AIFDS, AISB, AIPSU సహా పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విద్యార్థి నాయకులు ఈ బంద్‌కు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ, కేంద్ర ప్రభుత్వ విధానాలు విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు.

తెలంగాణలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మేధావులు బంద్‌కు మద్దతు ఇవ్వాలని విద్యార్థి సంఘాలు విజ్ఞప్తి చేశాయి. బంద్ రోజున రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించనున్నట్లు ప్రకటించాయి.