సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. ఉజ్వల భవిష్యత్తు కోసం లక్ష్యసాధన దిశగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
సోమవారం తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యవసాయ కళాశాలలో తెలంగాణ ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదకద్రవ్యాల నిరోధక అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, డ్రగ్స్ మరియు గంజాయి వంటి మత్తు పదార్థాలు యువత ఆరోగ్యం, కుటుంబం, భవిష్యత్తును నాశనం చేస్తాయని హెచ్చరించారు.
విద్యార్థుల కదలికలపై అధ్యాపకులు నిరంతరం నిఘా ఉంచాలని డీఎస్పీ సూచించారు. మాదకద్రవ్యాల విక్రయం, రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేసి సమాజాన్ని ఈ ముప్పు నుంచి కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.