నెల్లూరులో కూలిన పురాతన భవనం.. తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

నెల్లూరు నగరంలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. సిటీలోని గుప్తా పార్కు సమీపంలోని యనమల వారి వీధిలో ఉన్న పురాతన భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

నాలుగు కుటుంబాలు నివాసం ఉంటున్న ఈ భవనం మొదట ఒకవైపు కృంగిపోవడంతో నివాసితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే వారు బయటకు పరుగెత్తి పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు కలిసి లోపల చిక్కుకున్న పలువురిని సురక్షితంగా బయటకు తీసి సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.