దక్షిణ కొరియాలోని సియోల్‌లో భారత రాయబారి గౌరంగలాల్ దాస్‌తో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ సంస్థలను ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని ఆయన కోరారు. శాంసంగ్, ఎల్జీ, ఎస్కె, ఏఎస్ఐపీ–ఏపీఏసీటీ ఓశాట్ వంటి సంస్థలను ఇండియా సెమీకండక్టర్ మిషన్, ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0కు అనుసంధానించి రాష్ట్రానికి తీసుకురావడంలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
శ్రీసిటీ, నాయుడుపేట, కొప్పర్తి, విశాఖపట్నంలలో రెడీ-టు-యూజ్ పారిశ్రామిక క్లస్టర్లు సిద్ధంగా ఉన్నాయని లోకేష్ తెలిపారు. అలాగే ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ శ్రీసిటీ, ఆంధ్ర విశ్వవిద్యాలయాలతో కలిసి వీఎల్ఎస్ఐ, ఏటీఎంపీ/ప్యాకేజింగ్, ఎస్ఎంటీ, డిస్ప్లే టెక్నాలజీల్లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు కొరియా సహకారం అందించాలని కోరారు. కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ ప్రతిపాదించిన “కొరియా ఎన్క్లేవ్” ఆలోచనకు అనుగుణంగా శ్రీసిటీలో కొరియా చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ప్లగ్-అండ్-ప్లే టౌన్షిప్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.
అనంతపురంలో కియా–హ్యుందాయ్ మోబిస్ ఆటో–ఈవీ క్లస్టర్ విస్తరణ, ఆంధ్రప్రదేశ్ తీరంలో హెచ్డీ హ్యుందాయ్ తరహా గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ ఏర్పాటు, బ్యాటరీలు, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల అవకాశాలపై కూడా ఇరువురు చర్చించారు. ఏపీ–కొరియా పారిశ్రామిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక ఏపీ–కొరియా డెస్క్ ఏర్పాటు చేయనున్నట్లు లోకేష్ తెలిపారు. అలాగే ఈ నెల 10న జరగనున్న సియోల్ ఇన్వెస్టర్ రోడ్‌షో విజయవంతం కావడంతో పాటు ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరేలా సహకరించాలని భారత రాయబారిని కోరారు.