మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.. జూలై 7న ‘చలో విజయవాడ’కు ఏఐటీయూసీ పిలుపు

 

మున్సిపల్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూలై 7న నిర్వహించే ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఎస్. నాగరాజు, వి.సి. గోపినాథ్ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ రంగంలోని పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, స్కూల్ స్వీపర్లు, పార్కు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. గత నెల 20 నుంచి దశలవారీగా ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం స్పందించకపోవడంతోనే ‘చలో విజయవాడ’ ధర్నాకు పిలుపునిచ్చామని తెలిపారు.

ఈ కార్యక్రమానికి మద్దతుగా ఆదివారం చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని, పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, స్కూల్ స్వీపర్లు, పార్కు సిబ్బందికి నెలకు రూ.34 వేల కనీస వేతనం అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే రిటైర్డ్ కార్మికులకు రూ.5 లక్షల గ్రాట్యుటీ చెల్లించాలని, పారిశుద్ధ్య కార్మికులకు ఇళ్ల స్థలాలు కేటాయించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. పెరిగిన జనాభా, విస్తీర్ణానికి అనుగుణంగా అదనపు కార్మికులను నియమించి పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే యూనియన్ నాయకత్వాన్ని చర్చలకు ఆహ్వానించి సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగుతారని హెచ్చరించారు.