ఫిన్లాండ్కు చెందిన హెచ్ఎండీ (HMD) గ్లోబల్ సంస్థ నోకియా బ్రాండ్‌లో నాలుగు కొత్త 4G ఫీచర్ ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో నోకియా 200 4G, నోకియా 210 4Gతో పాటు గతంలో మంచి ఆదరణ పొందిన నోకియా 215 4G మరియు నోకియా 235 4G రెండో ఎడిషన్ (Second Edition) మోడళ్లు ఉన్నాయి. ఈసారి సాధారణ ఫీచర్ ఫోన్లకు భిన్నంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడం విశేషం.
ఈ కొత్త నోకియా 4G ఫీచర్ ఫోన్లలో ప్రత్యేకంగా AI బటన్‌ను అందించారు. అలాగే Express Chat యాప్‌ను ప్రీ-ఇన్స్టాల్ చేసి, వీడియో కాలింగ్ సదుపాయాన్ని కల్పించారు. ముఖ్యంగా Sikey AI అసిస్టెంట్ ద్వారా వాయిస్ కమాండ్లతోనే ఫ్లాష్‌లైట్ ఆన్ చేయడం, కెమెరా తెరవడం, రిమైండర్లు సెట్ చేయడం, ఫోన్ కాల్స్ చేయడం వంటి పనులను సులభంగా నిర్వహించవచ్చు. అదనంగా, Cloud Phone Service సదుపాయం ద్వారా క్లౌడ్ ఆధారిత ఫీచర్లను కూడా వినియోగించుకునే అవకాశం కల్పించారు.
ఈ నాలుగు ఫోన్లలో 1450mAh బ్యాటరీ, USB Type-C ఛార్జింగ్ పోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. అయితే, ఈ మోడళ్ల ధరలు, భారత మార్కెట్లో విక్రయాలు ప్రారంభమయ్యే తేదీని హెచ్ఎండీ సంస్థ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.