‘జీడీఎన్’ ట్రైలర్ విడుదల.. జీడి నాయుడు పాత్రలో ఆర్ మాధవన్ అదరగొట్టారు

 

భారత ప్రముఖ శాస్త్రవేత్త, ఆవిష్కర్త జీడి నాయుడు జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ ‘జీడీఎన్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఆర్ మాధవన్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. సత్యరాజ్, జయరామ్, ప్రియమణి, దుషారా విజయన్, వినయ్ రాయ్, తంబి రామయ్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వర్గీస్ మూలన్ పిక్చర్స్‌తో కలిసి మాధవన్ తన ట్రైకలర్స్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

రిలీజ్‌కు ముందు చిత్రబృందం ప్రమోషన్లు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. బ్రిటిష్ పాలనా కాలం నేపథ్యంలో రూపొందిన ఈ పీరియాడిక్ డ్రామాలో భారతదేశపు తొలి ఎలక్ట్రిక్ మోటార్‌ను రూపొందించిన జీడి నాయుడు జీవితం, ఆయన ఆవిష్కరణలు, బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా సాగించిన పోరాటాన్ని ప్రధానంగా చూపించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

ట్రైలర్‌లో మాధవన్ యువకుడిగా, వృద్ధుడిగా రెండు భిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తూ తన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా “బ్రిటిషర్లు భయపడ్డారు.. సొంత దేశస్థులు మర్చిపోయారు” అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. భావోద్వేగాలు, దేశభక్తి, విజ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చే ఈ బయోపిక్ ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంటుందో జూలై 17న తేలనుంది.