ఓటరు జాబితా సవరణను ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి: భట్టి విక్రమార్క

 

రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను క్షేత్రస్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజాభవన్‌లో జరిగిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో అన్‌మ్యాపింగ్ పేర్లు, సాంకేతిక లోపాలు, స్పెల్లింగ్ తప్పులు లేకుండా బీఎల్‌ఏలు, డివిజన్ స్థాయి నాయకులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ జీవిత బీమా వంటి సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని భట్టి విక్రమార్క సూచించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.40 వేల కోట్లతో చేపడుతున్న రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణ పనులను కూడా ప్రజలకు వివరించాలని ఆయన అన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో అన్‌మ్యాపింగ్ పేర్లు అధికంగా ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. లాజికల్ డిస్క్రిపెన్సీల కారణంగా ఓటర్ల పేర్లు తొలగిపోకుండా బీఎల్‌ఓలతో సమన్వయం చేసుకుని అవసరమైన ధృవీకరణ పత్రాలను సకాలంలో అందించాలని సూచించారు. పార్టీ విజయానికి బూత్ స్థాయి కార్యకర్తల పాత్ర కీలకమని, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని నేతలు పిలుపునిచ్చారు.