తెలంగాణలో మూడు కొత్త విమానాశ్రయాలకు వేగం.. వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంపై కీలక ముందడుగు

 

రాష్ట్రంలో ఏవియేషన్ రంగాన్ని విస్తరించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు వేగవంతం చేస్తున్నాయి. వరంగల్ మామునూరు విమానాశ్రయానికి ఇప్పటికే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, వచ్చే నెలలో శంకుస్థాపన జరగనుంది. అలాగే ఆదిలాబాద్ విమానాశ్రయానికి అనుమతి లభించడంతో డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు. మరోవైపు కొత్తగూడెం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం కోసం స్థల పరిశీలన పూర్తి చేసి, సంబంధిత నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించారు.

వరంగల్ మామునూరు విమానాశ్రయాన్ని నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1930లో నిర్మించారు. స్వాతంత్ర్యానికి ముందే ఇది ప్రముఖ విమానాశ్రయంగా సేవలందించింది. ప్రస్తుతం దీనిని ఆధునిక ప్రమాణాలతో పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతుండగా, రెండున్నరేళ్లలో పనులు పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని డిఫెన్స్, సివిల్ ఏవియేషన్ శాఖలు సంయుక్తంగా సుమారు 1,500 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నాయి. ఇందులో శిక్షణ కేంద్రంతో పాటు పౌర విమాన సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. కొత్తగూడెం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మూడు విమానాశ్రయాలు పూర్తయితే తెలంగాణకు ఏవియేషన్ రంగంలో మరింత గుర్తింపు లభించే అవకాశం ఉంది.