ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేసే సమయంలో పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ వివరాలను దాచిపెట్టినా లేదా తప్పుగా చూపించినా ఐటీ శాఖ కఠిన చర్యలు తీసుకోనుంది. ముఖ్యంగా పన్ను ఎగవేసే ఉద్దేశంతో వాస్తవ ఆదాయాన్ని తక్కువగా చూపడం (Under-reporting) లేదా తప్పుడు లెక్కలు చూపడం (Misreporting) వంటివి చేస్తే సెక్షన్ 270A కింద భారీ పెనాల్టీలు విధిస్తారు. పన్ను నిబంధనల పట్ల అవగాహన లేకపోవడం వల్ల జరిగే పొరపాట్లు ఒకెత్తయితే, కావాలని చేసే మోసాలను ఐటీ శాఖ సీరియస్గా పరిగణిస్తోంది.
ఐటీ శాఖ నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి తన ఆదాయాన్ని తక్కువగా రిపోర్ట్ చేసినట్లు తేలితే, ఆ తక్కువ చూపిన ఆదాయంపై చెల్లించాల్సిన పన్నుకు అదనంగా 50 శాతం పెనాల్టీ విధిస్తారు. అయితే, కావాలని ఆదాయాన్ని తప్పుగా చూపి (Misreporting) పన్ను ఎగవేతకు పాల్పడితే, ఆ పెనాల్టీ ఏకంగా 200 శాతానికి పెరుగుతుంది. అంటే చెల్లించాల్సిన అసలు పన్నుతో పాటు, దానికి రెట్టింపు మొత్తాన్ని జరిమానాగా కట్టాల్సి ఉంటుంది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులపై తీవ్ర ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.
కేవలం జరిమానాతోనే కాకుండా, తప్పుడు సమాచారం ఇస్తే ఐటీ శాఖ నోటీసులు పంపడం, స్క్రూటినీ చేయడం వంటి చర్యలు కూడా చేపడుతుంది. అద్దె ఆదాయం, షేర్ మార్కెట్ లాభాలు, ఇతర వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని దాచకుండా సరిగ్గా రిపోర్ట్ చేయడం ఉత్తమం. ఏవైనా పొరపాట్లు జరిగినట్లు గుర్తిస్తే, గడువు ముగియకముందే ‘రివైజ్డ్ రిటర్న్స్’ దాఖలు చేసి పెనాల్టీల నుండి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పారదర్శకంగా వ్యవహరించడం ద్వారా అనవసరపు చట్టపరమైన ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు.