తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ ద్వారా ప్రభుత్వానికి ఏకంగా ₹40,209 కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మద్యం ద్వారా ఈ స్థాయి ఆదాయం రావడం ఇదే మొదటిసారి. గత ఆర్థిక సంవత్సరం (2024-25) లో వచ్చిన ₹37,487 కోట్లతో పోలిస్తే, ఈసారి సుమారు 7 శాతం వృద్ధి నమోదైంది. కేవలం ఏడేళ్ల కాలంలోనే రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం రెట్టింపు కావడం గమనార్హం.
మొత్తం అమ్మకాల్లో లిక్కర్ విక్రయాలు 382.91 లక్షల కేసులుగా నమోదవ్వగా, బీర్ల అమ్మకాలు 387.34 లక్షల కేసులకు చేరాయి. ఏడాది పొడవునా జరిగిన అమ్మకాలను పరిశీలిస్తే, డిసెంబర్ నెలలో అత్యధికంగా ₹5,051 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. కొత్త ఏడాది వేడుకలు, ఎన్నికల సందడి వంటి కారణాలు ఈ భారీ ఆదాయానికి దోహదపడ్డాయని అధికారులు విశ్లేషిస్తున్నారు. అటు లిక్కర్ విక్రయాలతో పాటు ఇటు లైసెన్స్ ఫీజులు, దరఖాస్తుల రూపంలో కూడా ప్రభుత్వ ఖజానాకు భారీగా నిధులు చేరాయి.
మద్యం దుకాణాల లైసెన్స్ దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి ₹2,869 కోట్ల ఆదాయం రాగా, షాపుల రెంటల్ ఫీజుల ద్వారా ₹1,771 కోట్లు, బార్ల ద్వారా ₹549 కోట్లు లభించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాలు మరియు 1,214 బార్ల ద్వారా ఈ ఆదాయం సమకూరింది. సామాన్యులు తక్కువ ధర గల బ్రాండ్ల వైపు మొగ్గు చూపినప్పటికీ, విక్రయాల సంఖ్య పెరగడం వల్ల ఆదాయ గ్రాఫ్ నిలకడగా కొనసాగిందని ఎక్సైజ్ వర్గాలు వెల్లడించాయి.