ఏపీలో జనసేన పార్టీ బలపడేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి తర్వాత చాలామంది నేతలు దూరమయ్యారు. కూటమి ప్రభుత్వంలో జనసేన కీలకం కావడంతో మళ్లీ వచ్చేందుకు సిద్ధమయ్యారు. అలాంటివారిలో ఏపీ బీఆర్ఎస్ నేత తోట చంద్రశేఖర్ ఒకటి. ఆయన డిప్యూటీ సీఎం పవన్‌తో భేటీకావడం పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.
జనసేన పార్టీలోకి ఏపీ బీఆర్ఎస్ చీఫ్ రాక?
ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ పార్టీ మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆయన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆ పార్టీ నేతలు మాత్రం తోట కచ్చితంగా జనసేన తీర్థం పుచ్చుకోవడం ఖాయమని బలంగా చెబుతున్నారు. మరి ఇద్దరు నేతల మధ్య అసలేం జరిగింది?
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు. ఇప్పుడున్న రాజకీయాల నేపథ్యంలో నేతలు ఎప్పుడు, ఏ పార్టీలో ఉంటారో చెప్పడం కష్టం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిశారు ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్. మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసులో ఆయనతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో చంద్రశేఖర్ మళ్లీ జనసేనలోకి ఎంట్రీ ఇవ్వడం కాయమనే ఊహాగానాలు లేకపోలేదు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన తోట చంద్రశేఖర్, వివిధ అంశాలపై చర్చ
జనసేన తరపున తోట చంద్రశేఖర్ 2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ మార్చి దేశవ్యాప్తంగా కేసీఆర్ విస్తరించడం మొదలుపెట్టారు. ఆ నేపథ్యంలో తోట చంద్రశేఖర్.. కేసీఆర్ భేటీ కావడంతో ఆపై కండువా కప్పుకోవడం జరిగిపోయింది.
అంతేకాదు ఆయనకు ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. ఇదంతా గతం. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. 2024 ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. దీంతో రెండేళ్లు గడిచిన తర్వాత చంద్రశేఖర్ మళ్లీ యాక్టివ్ మోడ్‌లోకి వచ్చారు.
తోట చంద్రశేఖర్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి. 2008లో ఉద్యోగానికి ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలుత ప్రజారాజ్యం పార్టీ స్థాపనలో కీలకపాత్ర పోషించారు. మెగా బ్రదర్స్‌కు అత్యంత సన్నిహితుడిగా ఆయన మారారు. ఆ తర్వాత జనసేన పార్టీలో ఆయన కీలకంగా వ్యవహరించారు.
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఆయన వైసీపీలో తీర్థం పుచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ఏలూరు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మళ్లీ జనసేన పార్టీలో చేరిన తర్వాత 2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో జనసేన ఒక్కసీటు గెలవలేదు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
మొన్నటి తెలంగాణ, ఏపీ ఎన్నికల తర్వాత రాజకీయాల్లో ఆయన యాక్టివ్‌గా లేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తోట చంద్రశేఖర్ మర్యాదపూర్వకంగా కలిశారా? ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా? అనేది తెలియాల్సి వుంది. కూటమి ప్రభుత్వంలో జనసేన కీలక రోల్ పోషించడంతో చంద్రశేఖర్ జనసేన పార్టీలోకి రీ ఎంట్రీ ఇస్తారనే చర్చ లేకపోలేదు. దీనిపై చంద్రశేఖర్ ఏమంటారో చూడాలి.