విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ విడుదలకు సిద్ధమవుతోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుండగా, తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది.
ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. సోమవారం నుంచి సినిమాలోని ప్రధాన పాత్రలను ఒక్కొక్కటిగా పరిచయం చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా ముందుగా వెంకటేష్ పోషిస్తున్న ‘చిట్టిబాబు’ పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు.
ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, యువినా పార్థవి, రాజా ప్రజ్వల్ తదితరులు వెంకటేష్ కుటుంబ సభ్యుల పాత్రల్లో కనిపించనున్నారు. కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, త్రివిక్రమ్ శైలిలోని సంభాషణలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది.