కరోనా వైరస్‌తో రాగల ముప్పు గురించి ఎందరు హెచ్చరించినా మొదట్లో బేఖాతరు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్వాకానికి ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన స్థితిలో పడింది. లక్ష నుంచి 2 లక్షలమంది వరకూ ఈ వ్యాధికి బలయ్యే ప్రమాదం వున్నదని ‘చావు కబురు’ చల్లగా చెప్పినట్టు ఆయన ఇప్పుడు ప్రకటిస్తున్నారు. సరిగ్గా నెలక్రితం ఆయన కరోనా ప్రమాదం గురించి కొట్టిపడేశారు. మార్చి 3న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధి గురించి హెచ్చరిస్తూ, దీని బారిన పడినవారిలో 3.4 శాతం మంది బలయ్యే అవకాశం వున్నదని తెలిపింది. కానీ ట్రంప్ అదంతా అబద్ధమని తోసిపుచ్చారు. మరణాల రేటు మహావుంటే ఒక శాతం ఉండొచ్చునని వాదిం చారు. అతిగా అంచనాలు వేసి భయపెట్టొద్దని సలహా కూడా ఇచ్చారు. ఇన్నాళ్లకు ఆయనకు జ్ఞానోద యమైంది.
ఇందుకు వైద్య రంగ నిపుణుల్ని, శాస్త్రవేత్తల్ని మొదటగా అభినందించాలి. నెలరోజులుగా వారు ఎంతో శ్రమపడితే తప్ప ట్రంప్ ఈ స్థాయికి వచ్చివుండరని ఆయన మొండివైఖరి గురించి తెలిసినవారందరికీ అర్థమవుతుంది. ప్రమాద తీవ్రతను అంగీకరించిన ఈ సమయంలో కూడా ‘ఇంత తక్కువ మరణాలు’ తన ప్రభుత్వం తీసుకునే చర్యలవల్లేనని ట్రంప్ చెప్పుకున్నారు. మృతుల సంఖ్య ఒకేరోజు 500 దాటాక తన ప్రథమ ప్రాధాన్యత కరోనాయేనని, ఆర్థిక వ్యవస్థ ఆ తర్వాతే వస్తుందని తెలిపారు. కొన్ని రోజులు వెనక్కి వెళ్లి చూస్తే ట్రంప్ దీనికి విరుద్ధమైన ప్రకటనలు చేశారు. కరోనా వ్యాధి పెద్ద సమస్యకాదని, ఆర్థిక వ్యవస్థ సక్రమంగా నడపడమే తన కర్తవ్యమని ఆయన చెప్పిన సంగతి ఎవరూ మరిచిపోరు. సరిగదా… చాలా త్వరలోనే ఈ వ్యాధికి వ్యాక్సిన్ రాబోతోందని కూడా ట్రంప్ మార్చి 7న భరోసా ఇచ్చారు. మంగళవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య 8,00,000 దాటి ముందుకుపోగా, ఇందులో ఒక్క అమెరికాలోనే 1,65,000 మంది వున్నారు. ట్రంప్ నిలకడలేని ప్రకటనలు అమెరికా ప్రజల్ని భ్రమల్లో ముంచెత్తాయి. ఆయన మాటలతో సంబంధం లేకుండా వివిధ రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యలు అమల్లోకి తెచ్చినా పౌరులెవరూ వాటిని తీవ్రంగా తీసుకోలేదు. వివిధ రాష్ట్రాల గవర్నర్లను ట్రంప్ ఎగతాళి కూడా చేశారు. అదే ఇప్పుడు కొంపముంచిందని రోజురోజుకీ పెరుగుతున్న వ్యాధిగ్రస్తుల సంఖ్యను చూస్తే అర్థమవుతుంది.