ఆర్బీఐ ఆదేశాల మేరకు – మీ డబ్బు మీ హక్కు కార్యక్రమాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలి-అదనపు కలెక్టర్ బి ఎస్ లత.

తేది:23-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా:గడచిన కొన్ని సంవత్సరాలుగా క్లెయిమ్ చేసుకొని ఆర్థికపరమైన ఆస్తుల కోసం మీ డబ్బు,మీ హక్కు ప్రత్యేక కార్యక్రమాన్ని ఆర్బీఐ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ బిఎస్ లత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాలకు అనుగుణంగా మీ డబ్బు, మీ హక్కు అనే నినాదంతో క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల సమస్యను పరిష్కరించేందుకు కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. బ్యాంకు పొదుపులు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా తదితరాలను క్లెయిమ్ చేసుకునేందుకు వీలు కల్పించాలన్న లక్ష్యంతో దీనిని చేపట్టారని వివరించారు.
ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, బంధువులు, సమీప ప్రజలకు తెలియజేయాలని సూచించారు. క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల వాస్తవ యజమానులు వాటిని పొందేందుకు సంబంధిత బ్యాంకు శాఖలను, భీమా సంస్థలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు, స్టాక్ బ్రోకరేజ్ సంస్థలు ఆన్లైన్ ద్వారా స్టాక్ బ్రోకర్లలో దేనినైనా సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ వివరాలకు సంబంధించిన గుర్తింపు కార్డులు, ధృవీకరణ పత్రాలు సమర్పించి డబ్బులు పొందాలని పిలుపు ఇచ్చారు. కచ్చితంగా నామినీ వివరాలను ఆర్థికపరమైన లావాదేవీల్లో పెట్టాలని, అడ్రస్ మారితే బ్యాంక్ అధి కారులకు తెలియజేయాలని సూచించారు. ఆర్బీఐ ఎల్డీఓ యశ్వంత్ సాయి మాట్లాడుతూ బ్యాంకుల్లో 10 సంవత్సరాలకు పైగా క్లెయిమ్ చేసుకోని డిపాజిట్ల వివరాలు ఆర్బీఐ ఉద్గమ్ వెబ్సైట్ ద్వారా పొందొచ్చని తెలిపారు. జిల్లా పరిధిలోని బ్యాంకర్లు ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని అర్థం చేసుకొని వీలైనంత త్వరగా ఖాతాదారుల నామినీ లేదా కుటుంబ సభ్యులకు ఈ సమాచారం చేరవేసి డబ్బులు పొందేందుకు క్షేత్ర స్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా హాజరైన వివిధ బ్యాంకుల మరియు ఎల్ఐసి ఖాతాదారుల కుటుంబ సభ్యులకు సెటిల్ మెంట్ పత్రాలను అందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ కుమార్, యూబీఐ ఛీఫ్ మేనేజర్ విశాల్, ఎస్బీఐ ఛీఫ్ మేనేజర్లు మహేష్, వేంకటేశ్వర్లు, ఎల్ఐసి నోడల్ అధికారి రవీందర్, కేడిసిసిబి ఏజిఎం మహేష్, బ్యాంకు అధికారులు ప్రశాంత్, ప్రీతమ్, రవీంద్ర, ఎఫ్ఎల్సీ మధు సూదన్, సిఫెల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *