భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇప్పటికే తీస్తా నది జలాల వివాదం కొనసాగుతుండగా, తాజాగా గంగా నదీ జలాల ఒప్పందం కూడా చర్చనీయాంశంగా మారింది. 1996లో భారత్, బంగ్లాదేశ్ మధ్య కుదిరిన గంగా జలాల ఒప్పందం 2026 డిసెంబర్‌తో ముగియనుంది. ఈ ఒప్పందం పునరుద్ధరణకు ముందు కొత్త డిమాండ్‌ను బంగ్లాదేశ్ తెరపైకి తీసుకొచ్చింది.
కొత్త ఒప్పందంలో ‘హామీ నిబంధన’ను చేర్చాలని బంగ్లాదేశ్ కోరుతోంది. కరువు, నీటి లభ్యత తక్కువగా ఉన్న సమయంలోనూ తమ దేశానికి నిర్దిష్ట పరిమాణంలో నీరు అందేలా ఈ నిబంధన ఉండాలని ఢాకా భావిస్తోంది. అవసరమైతే ఈ అంశంపై అంతర్జాతీయ వేదికలను ఆశ్రయించేందుకు కూడా బంగ్లాదేశ్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
1996 గంగా జలాల ఒప్పందంలో ముఖ్యాంశాలు
భారత్, బంగ్లాదేశ్ 1996 డిసెంబర్ 12న గంగా జలాల పంపిణీ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అప్పటి ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఒప్పందం కాలపరిమితి 30 సంవత్సరాలు కావడంతో 2026 డిసెంబర్‌తో ఇది ముగియనుంది.
ఫరక్కా వద్ద లభించే గంగా నది జలాలను నీటి కొరత ఉన్న సమయంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య పంపిణీ చేయడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా జనవరి 1 నుంచి మే 31 వరకు ఉండే పొడి కాలంలో నీటి పంపిణీకి సంబంధించిన నిబంధనలు ఇందులో ఉన్నాయి. ఏడాది పొడవునా నీటి సరఫరాకు సంబంధించిన ఒప్పందం ఇది కాదు.
హామీ నిబంధన కోసం బంగ్లాదేశ్ పట్టు
ప్రస్తుత ఒప్పందం కుదిరిన సమయంలో ఉన్న జల పరిస్థితులు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని బంగ్లాదేశ్ వాదిస్తోంది. వాతావరణ మార్పులు, అస్థిర వర్షపాతం, కరువు వంటి కారణాలతో నదీ ప్రవాహాలు మరింత అనిశ్చితంగా మారాయని పేర్కొంటోంది.
కొత్త ఒప్పందంలో ‘సమాచార హక్కు’ (Right to Information) నిబంధనను చేర్చడంతో పాటు, 1977 గంగా ఒప్పందంలో ఉన్నప్పటికీ 1996 ఒప్పందంలో తొలగించిన ‘హామీ నిబంధన’ను తిరిగి చేర్చాలని బంగ్లాదేశ్ కోరుతోంది. ఈ నిబంధన ద్వారా నీటి లభ్యత తక్కువగా ఉన్న సమయంలో దిగువన ఉన్న దేశానికి కనీస పరిమాణంలో నీరు అందేలా హామీ ఇవ్వాలని ఆ దేశం కోరుతోంది.