తిరుమలలో మహాపరాథం..! చెప్పులతో తిరుమల శ్రీవారి ఆలయంలోకి..

తిరుమలలో మహాపరాథం చోటు చేసుకుంది. ముగ్గురు భక్తులు చెప్పులతో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. క్యూలైన్ దాటుకుని ఏకంగా ఆలయం మహా ద్వారం వరకు వచ్చేశారు. ఏ మాత్రం ఆలస్యం జరిగి ఉన్నా ఆ ముగ్గురు కూడా చెప్పులతో ఆలయంలోకి అడుగు పెట్టుండేవాళ్లే.

 

ఆ సమయంలో మహాద్వారం వద్ద గుర్తించిన విధి నిర్వహణలో ఉన్న టీటీడీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. చెప్పులు వదిలి ఆలయంలోనికి వెళ్లాలని చెప్పారు. దీనితో- ఆ ముగ్గురూ తమ చెప్పులను మహాద్వారం వద్ద వదిలేసి ఆలయంలోకి ప్రవేశించారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

క్యూ లైన్‌ను దాటుకుని ఈ ముగ్గురు భక్తులు చెప్పులతో ఏకంగా మహా ద్వారం వద్దకు ఎలా వచ్చారనేది అంతు చిక్కట్లేదు. ఈ విషయంలో టీటీడీ విజిలెన్స్ విభాగం గానీ, సిబ్బంది గానీ నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది స్పష్టమౌతోంది. నిజానికి- వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి భక్తులు ప్రవేశించే సమయంలోనే విజిలెన్స్, టీటీడీ ఉద్యోగులు గుర్తించాల్సి ఉంటుంది.

 

అక్కడే భద్రతా సిబ్బంది భక్తులను తనిఖీ చేస్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి మొబైల్ ఫోన్ తీసుకెళ్లడం, చెప్పులను ధరించి అక్కడ అడుగు పెట్టడం నిషేధం. నిషేధిత వస్తువులు ఏవైనా ఉన్న వాటిని తీసుకుని లోనికి వెళ్లడానికి అనుమతించరు. విసృతంగా తనిఖీ చేసిన తరువాతే భక్తులను క్యూ కాంప్లెక్స్‌లోకి పంపిస్తుంటారు.

 

ఇప్పుడు మాత్రం ముగ్గురు భక్తులు పాదరక్షలతోనే మహాద్వారం వరకు వచ్చేయడం కలకలం రేపింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌ వద్ద భద్రత సిబ్బంది వీరిని గుర్తించకపోవడం వల్లే వారు పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించారు. వాళ్లు ఏ మాత్రం పట్టించుకోకపోవడం వల్ల ఈ దుస్థితి తలెత్తింది.

 

ఈ ఘటనను టీటీడీ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. సిబ్బందిపై చర్యల తీసుకుంది. ఏడుమందిని సస్పెండ్ చేసింది. మరో ఆరుమందిని సస్పెండ్ చేయాలంటూ ప్రతిపాదించింది. ఆయా ఉద్యోగుల పేర్లు, పూర్తి వివరాలతో కూడిన ఓ ప్రకటనను టీటీడీ విడుదల చేసింది. తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించడంలో విఫలం కావడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన వివరించింది.

 

ఫుట్‌పాత్ హాల్, డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న టీటీడీ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు సస్పెండ్ అయ్యారు. అలాగే తమ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని కోరుతూ ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌కు ప్రతిపాదన పంపారు.

 

సస్పెండ్ అయిన వారిలో చక్రపాణి- సీనియర్ అసిస్టెంట్, వాసు- జూనియర్ అసిస్టెంట్, టీటీడీ భద్రతా సిబ్బంది- డీ బాలకృష్ణ (పీఎస్జీ 0807), వసుమతి (సీడబ్ల్యూపీఎస్జీ 514067), టీ రాజేష్ కుమార్ (ఏడబ్ల్యూపీఓ 512475), కే వెంకటేష్ (పీఎస్జీ 932), ఎం బాబు (ఏడబ్ల్యూపీఓ) ఉన్నారు.

 

సస్పెన్షన్‌కు సిఫారసు చేసిన ఎస్పీఎఫ్ సిబ్బంది- సీ రమణయ్య (ఇన్‌ఛార్జ్ ఏఎస్ఐ 1101), బీ నీలబాబు (సీటీ 3595), డీఎస్‌కే ప్రసన్న (సీటీ 3602), సత్యనారాయణ (ఏఎస్ఐ 696), పోలి నాయుడు (సీటీ 3516), ఎస్ శ్రీకాంత్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *