మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వైసీపీని మళ్లీ రీఛార్జ్ చేసే పనిలో పడ్డారు. ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి.. తర్వాత పరిణామాలతో వైసీపీ శ్రేణులు నిస్తేజంగా మారిపోయాయి. ఒక వైపు నేతలంతా వరుసగా పార్టీని వీడుతున్న తరుణంలో మళ్లీ నేతలను సమాయత్తం చేసేందుకు పలు వ్యూహాలు రచిస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వం తీరును ఖండిస్తూ నిరసనాలకు పిలుపునిస్తూనే .. నేతల్లో నూతనోత్తేజం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో కొత్త ఊపు తీసుకురావడానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది.
గత కొంతకాలంగా గమనిస్తే వైసీపీ సోషల్ మీడియా టీం మరింత యాక్టివ్ అయ్యింది. ప్రభుత్వ వైఫ్యల్యాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూనే సైలెంట్ అయిపోయిన నేతలను కూడా మళ్లీ యాక్టివ్ చేసేందుకు 33 మందితో పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు ఉండనుండగా.. పీఏసీ కన్వినర్‌గా సజ్జల రామకృష్ణారెడ్ని నియమించారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది.
పీఏసీ కమిటీలో తమ్మినేని సీతారాం, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేశ్, పినిపే విశ్వరూప్, తోట త్రిమూర్తులు, ముద్రగడ పద్మనాభం, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, నందిగం సురేష్ బాబు, ఆదిమూలపు సురేశ్, అనిల్ కుమార్ యాదవ్, పీడిక రాజన్న దొర, బెల్లాన చంద్రశేఖర్, గొల్ల బాబురావు, బూడి ముత్యాలనాయుడు, పిల్లి సుభాష్ చంద్రబోస్, పుప్పాల శ్రీనివాసరావు (వాసు బాబు), చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు, కోన రఘుపతి, విడదల రజిని, ఆర్.కె. రోజా.. బొల్లా బ్రహ్మనాయుడు, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కళత్తూరు నారాయణ స్వామి, వైయస్ అవినాష్ రెడ్డి, షేక్ అంజాద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అబ్దుల్ హఫీజ్ ఖాన్, మాలగుండ్ల శంకర నారాయణ, తలారి రంగయ్య, వై. విశ్వేశ్వర రెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాస్, సాకే శైలజానాథ్ ఉన్నారు.
అలానే పలు స్థానాలకు సంబంధించి అధ్యక్షులను కూడా నియమించారు. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే విశ్వరూప్.. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే శ్రీకాంత్ నియమితులయ్యారు. అదే విధంగా కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులుగా చిర్ల జగ్గిరెడ్డి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్, క్రమశిక్షణా కమిటీ సభ్యులుగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని వైఎస్ జగన్ నియమించారు.