తిరుమల పుణ్యక్షేత్రంలో నిర్మాణాలపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన మఠాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తిరుమలలో నిర్మాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని టీటీడీకి సూచించింది.
ఎంతో సుందరమైన తిరుమలను కాంక్రీట్ జంగిల్ కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తిరుమలలో అక్రమ నిర్మాణాలు ఇలానే కొనసాగిస్తే కొంతకాలం తర్వాత అక్కడి అటవీ ప్రాంతం కనుమరుగవుతుందని హైకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.
తిరుమలలో ధార్మిక సంస్థలు, మఠాల పేరుతో ఎలా పడితే అలా నిర్మాణాలు చేస్తామంటే కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. ఒక మఠం చేపట్టిన అక్రమ నిర్మాణాలపై ఇప్పటికే చర్యలకు ఆదేశించామని పేర్కొన్న హైకోర్టు .. తిరుమలలో నిర్మాణాలు చేపట్టిన పలు మఠాలకు నోటీసులు జారీ చేసింది.
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని దేవాదాయ శాఖ కార్యదర్శి, టీటీడీ ఈవో, టీటీడీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌కు ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది.