అక్రమంగా దేశంలోకి చొరబడడం.. వారి ప్రాబల్యం పెరిగిన వెంటనే స్థానికులపై దాడులకు తెగబడడం అక్రమ వలసదారులకు సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా.. మయన్మార్, బంగ్లా దేశ్ నుంచి దేశంలోని అక్రమంగా చొచ్చుకు వస్తున్న అక్రమ వలసలతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. స్థానికంగా రాజకీయాలను సైతం ప్రభావితం చేస్తున్న ఆయా వర్గాలు.. అంతర్గత భద్రతకు ముప్పుగా మారాయి. కొన్ని సరిహద్దు రాష్ట్రంలోని పాలకులు వారి ప్రవేశాల్ని అనుమతిస్తున్నారన్న ఆరోపణలు వెళ్లువెత్తుతున్నా… ఇప్పటి వరకు సమర్థనీయమైన చర్యలు మాత్రం చేపట్టిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే.. కేంద్ర ప్రభుత్వం అక్రమ వలసదారులపై ఉక్కపాదం మోపేందుకు సిద్ధమైంది. వారిని తిరిగి ఆయా దేశాలకు తరలించేందుకు కసరత్తులు చేస్తోంది.
దేశంలో అక్రమ వలసలపై చర్యలను ముమ్మరం చేస్తూ కేంద్రం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యల్ని వేగవంతం చేశాయి. వివిధ ప్రాంతాల్లో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు సహా ఇతర చొరబాటుదారులను గుర్తించి, వారిని బహిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశంపై గత నెలలో స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. నకిలీ పత్రాల ద్వారా బంగ్లాదేశ్, రోహింగ్యా అక్రమ వలసదారులకు సాయపడుతున్న నెట్‌వర్క్‌పై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వారి ప్రవేశాన్ని కష్టతరం చేసే కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు గత మూడు నెలలుగా దేశవ్యాప్తంగా వందలాది మంది అక్రమ బంగ్లాదేశీయులు, రోహింగ్యాలను గుర్తించారు. వారిని అరెస్టులు చేస్తూ.. నిర్భందంలోకి తీసుకుంటున్నారు.
దిల్లీలో కొనసాగుతున్న అరెస్టులు
జనవరి మొదటి వారంలో దిల్లీ పోలీసులు నిర్వహించిన సోదాల్లో.. దేశంలో అక్రమంగా ప్రవేశించిన ఎనిమిది మంది బంగ్లాదేశ్ జాతీయులను అరెస్టు చేశారు. మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు… వీరంతా 2012 నుంచి దేశంలో దర్జాగా నివసిస్తున్నట్లు గుర్తించారు. దిల్లీ పోలీసులు సౌత్ వెస్ట్ డిస్ట్రిక్ట్ లో వెరిఫికేషన్ డ్రైవ్ నిర్వహించగా.. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే ఉంటున్న మరో ఐదుగురు బంగ్లాదేశ్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. మార్చి 11న చొరబాటుదారుల కోసం మరోమారు సోదాలు నిర్వహించగా.. మరికొంత మంది బంగ్లాదేశ్ ముస్లీంలు బయటపడ్డారు. వీరంతా.. నకిలీ పత్రాలను సృష్టించి దేశంలో అక్రమంగా ప్రవేశించినట్లుగా గుర్తించారు. ఈ ఏడాది జనవరిలో లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా దిల్లీలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశ్ జాతీయులను గుర్తించేందుకు ఆపరేషన్ ప్రారంభించాలని పోలీసులను ఆదేశించిన తర్వాత పోలీసులు దేశ రాజధాని అంతటా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దేశ రాజధానిలో నివసిస్తున్న అనేక మంది అక్రమ వలసదారులు ఈ ప్రాంతంలో తీవ్రమైన నేర కార్యకలాపాలతో ముడిపడి ఉన్నట్లు ఈ సోదాల్లో వెల్లడైంది.
గుజరాత్, మహారాష్ట్ర
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 15 మంది బంగ్లాదేశ్ జాతీయులను అరెస్టు చేశారు. వారు వ్యభిచారం కోసం మైనర్ బాలికలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే.. మార్చి 10న మహారాష్ట్రలోని థానేలోని సెషన్స్ కోర్టు ఒక బంగ్లాదేశ్ జాతీయుడిని దేశంలోకి అక్రమంగా ప్రవేశించి నివసిస్తున్నందుకు దోషిగా నిర్ధారించింది. 1946 నాటి విదేశీయుల చట్టంలోని సెక్షన్ 14 కింద అతను దోషిగా తేలింది. విచారణలో, అతను తాను బంగ్లాదేశ్ జాతీయుడినని, ఒక ఏజెంట్‌కు రూ. 20,000 చెల్లించి భారతదేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించినట్లుగా అంగీకరించాడు.
ఇలా.. ఒకటి రెండు చోట్ల కాదు.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగ్లాదేశ్, రోహింగ్యా ముస్లింలు భారీ ఎత్తున నివసిస్తున్నట్లు నిఘా వర్గాలు, భద్రతా దళాలు అంచనాకు వచ్చాయి. వీరంతా.. వివిధ నేరాల్లో పాల్గొంటూ.. దేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కేంద్రం అనుమానిస్తోంది. ఈ కారణంగా.. అమెరికా ప్రభుత్వం నిర్వహించినట్లుగా దేశ వ్యాప్తంగా విస్తృతంగా సోదాలు నిర్వహించి, అక్రమ వలసదారుల్ని దేశం నుంచి తరిమేయాలని చూస్తున్నారు. ఇందుకోసం.. అక్రమ వలసదారులను గుర్తించి, వారి వివరాలను నమోదు చేయడం, వారిని ప్రత్యేక నిర్భంద కేంద్రాలకు తరలించాలని చూస్తోంది. మరోవైపు.. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడం ద్వారా, అక్రమ ప్రవేశాలను నిరోధించడంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం.. బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె నిర్మించడం, వలసదారులు బోర్డర్ దాటకుండా నిరోధించేందుకు చర్యలు చేపడుతోంది.
లోక్‌సభలో ఇమ్మిగ్రేషన్-విదేశీయుల బిల్లు
దేశంలోని అక్రమ వలసలను నియంత్రించేందుకు, విదేశీయుల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టంతో ముందుకు వచ్చింది. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు-2025 పేరుతో రూపొందించిన ఈ బిల్లులో అక్రమ వలసల్ని నిరోధించేందుకు చర్యలు చేపట్టింది. ఈ బిల్లును మార్చి 11, 2025న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఇందులో.. అక్రమ వలసల నిరోధానికి.. కఠిన శిక్షలు అమలు చేయాలని సూచించారు. అందులో భాగంగా.. పాస్‌పోర్టు లేదా వీసా లేకుండా భారత్‌లోకి ప్రవేశించే విదేశీయులకు రూ.5 లక్షల వరకు జరిమానా, ఐదేళ్ల జైలుశిక్ష విధించేందుకు న్యాయస్థానాలకు అవకాశం కల్పించారు. అలాగే.. డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసి ప్రవేశించే వారికి ఏడేళ్ల వరకు జైలుశిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధించేలా.. చట్టాన్ని అమలు చేయాలని ప్రతిపాదించారు. దాంతో పాటే.. విదేశీయుల రాకపోకలు, నివాసం, పర్యటనలను పర్యవేక్షించేందుకు కేంద్రానికి పూర్తి అధికారం ఉంటుందని ఈ బిల్లు ద్వారా కేంద్రం స్పష్టం చేసింది