హైదరాబాద్‌లో సాయంత్రం అయితే చాలు గంట లేదా రెండు గంటలపాటు దోమలు వీరవిహారం చేస్తున్నాయి. వాటికి బయటపడి ఆ సమయం లో చాలా మంది ఇళ్లలో తలుపు తీసిన సందర్భాలు లేవు. జీహెచ్ఎంసీ పరిధిలో చాలా ప్రాంతాలకు దోమల సమస్య వెంటాడుతోంది. వాటిని కంట్రోల్ చేసేందుకు మాస్టర్ ప్లాన్ చేస్తోంది బల్దియా.
దోమల నివారణకు ప్రతీ ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది జీహెచ్ఎంసీ. అయినా కంట్రోల్ కావడం లేదు. కాకపోతే నిధులు మాత్రం భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారు. అయినా ఫలితం దక్కలేదు. సీజన్ మారగానే షరామామూలే. దీనిపై బల్దియా ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇంతకీ జీహెచ్ఎంసీ కొత్త ప్లాన్ ఏంటి? కొంతలో కొంతైనా ఉపశమనం కలుగులుతుందా?
ప్రతీ రోజు సాయంత్రం ఐదున్నర నుంచి ఏడున్నర వరకు దోమలు వీర విహారం చేస్తున్నాయి. గతంలో వీటి నివారణకు హాట్ ఫాగింగ్ ఉపయోగించేవారు. ఇప్పుడు కోల్డ్ ఫాగింగ్‌ని వినియోగించాలని ఆలోచన చేస్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షలు చేశారు. అవి మంచి ఫలితాలు సాధించాయి. రేపు మాపో జీహెచ్ఎంసీ పరిధిలో వాటిని విస్తరించాలని భావిస్తోంది.
దోమల నివారణకు గతంలో హాట్ ఫాగింగ్ విధానాన్ని చేపట్టింది జీహెచ్ఎంసీ. దాని స్థానంలో కోల్డ్ ఫాగింగ్ విధానాన్ని తీసుకురానుంది. దోమల నివారణకు అమ్రపాలి కమిషనర్‌గా ఉన్నప్పుడు కోల్డ్ పద్దతిని తీసుకొచ్చారు. సౌతిండియాలో తొలిసారి ఈ విధానాన్ని గతేడాది అక్టోబర్‌లో ప్రవేశపెట్టారు. చాలా ప్రాంతాల్లో సక్సెస్ అయ్యింది కూడా. ఈలోగా ఆమె ఏపీకి ట్రాన్స్‌ఫర్ అయ్యారు.
ప్రస్తుత కమిషనర్ ఇలంబర్తి ఈ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి రేపో మాపో శాస్త్రవేత్తలతో భేటీ నిర్వహించాలని ఆలోచన చేస్తున్నారు. ఆ తర్వాత కొత్త టెక్నాలజీ పద్దతిని ప్రవేశపెట్టవచ్చా? లేదా అనేది తెలియనుంది.
నీటి ద్వారానే ఈ విధానాన్ని అమలు చేయవచ్చు. కొంత మోతాదు నీటిలో రెండు శాతం డెల్టామెత్రిన్ దోమల మందును కలిపి, యంత్రాలతో గాల్లోకి వ్యాపింప చేయాలి. నీటి బిందువులు గాలిలో పొరలా ఏర్పడి దోమలను అంతం చేస్తాయి. వీటి వల్ల ఎలాంటి అనారోగ్యం సమస్యలు తలెత్తవు. గతంలో ప్రశాసన్ నగర్‌లో ప్రయోగం చేశారు. మంచి ఫలితాలు వచ్చినట్టు తేలింది.
దోమల నివారణ కోసం హాట్ ఫాగింగ్ పద్దతికి ప్రతీ ఏటా జీహెచ్ఎంసీ 25 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. డీజిల్ ద్వారా హాట్ ఫాగింగ్ చేసేది. డీజిల్ కొనుగోలు విధానంలో అవినీతి జరిగినట్టు కమిషనర్ దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో శాస్త్రవేత్తలతో మాట్లాడి కోల్డ్ విధానాన్ని తీసుకురావాలన్నది బల్దియా ప్లాన్. దీనివల్ల డెంగ్యూ, మలేరియా వ్యాధులను కొంతైనా అరికట్టు వచ్చని ఆలోచన చేస్తోంది.