తెలుగుదేశం పార్టీలో రానున్న రోజుల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయా? పార్టీ జాతీయ సెక్రటరీ పదవికి లోకేష్ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారా? డిప్యూటీ సీఎం పదవిపై కన్నేయడమే అందుకు కారణమా? పార్టీ గురించి పొలిట్ బ్యూరోలో ఎలాంటి చర్చ జరగనుంది? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేష్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
టీడీపీలో చాలా మార్పులు చేర్పులు జరగనున్నాయి. సీనియర్లతోపాటు యూత్‌కి ప్రాధాన్యత ఇచ్చేలా అధినేత చంద్రబాబు ప్లాన్ వేశారు. ఇందుకు సంబంధించి మనసులోని మాట బయపెట్టారు పార్టీ జాతీయ కార్యదర్శి, మంత్రి నారా లోకేష్. సోమవారం విశాఖ వచ్చిన మంత్రి లోకేష్, మీడియా అడిగిన పలు ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చారు.
అందులో ఒకటి డిప్యూటీ సీఎం పదవి. లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందే నంటూ పార్టీ నేతల నుంచి ఒకటే రీసౌండ్. పరిస్థితి గమనించిన హైకమాండ్, వీటిపై ఎవరూ మాట్లాడకూడదని నేతలకు ఆదేశాలు జారీ చేసింది. సీఎం చంద్రబాబు ఏ పదవి అప్పగించినా తాను కష్టపడి పని చేస్తానన్నారు. ముఖ్యంగా పార్టీని బలోపేతానికి తాను చేయాల్సిన పనులు చేస్తానన్నారు.
పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే పనులు చేయనని కుండబద్దలు కొట్టేశారు లోకేష్. పార్టీ అప్పగించిన ప్రతీ పని చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. ఇదే క్రమంలో మరో మాట చెప్పారు. కొత్త కమిటీలపై పొలిట్ బ్యూరోలో చర్చిస్తామన్నారు. ఒక వ్యక్తి.. ఒక పదవిలో మూడుసార్లు కంటే ఎక్కువ ఉండకూడదని తన వ్యక్తిగత అభిప్రాయంగా వెల్లడించారు. ఇది పార్టీ నిర్ణయం కాదని తేల్చేశారు.
తాను ఇప్పటికే మూడుసార్లు నేషనల్ జనరల్ సెక్రటరీలో కొనసాగానని, ఆ పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించారు మంత్రి లోకేష్. ఈ లెక్కన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దాదాపు ఖాయమన్నది ఆ పార్టీ నేతల మాట. పార్టీ జాతీయ కార్యదర్శి పదవి నుంచి తప్పుకుంటే ఆ పదవి ఎవరికనేది పార్టీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
పార్టీ జాతీయ కార్యదర్శి పదవిని ఈసారి ఎవరికి దక్కుతుంది? సీనియర్లకు ఇస్తారా, లేక యూత్‌కి ప్రయార్టీ ఇస్తారా అనేదానిపై టీడీపీలో చర్చ మొదలైపోయింది. లోకేష్ తోడళ్లుడు, విశాఖ ఎంపీ భరత్‌కు ఇచ్చే అవకాశముందని అంటున్నారు. అలా చేస్తే యూత్‌కి మంచి సంకేతాలు ఇచ్చినట్టు అవుతుందన్నది కొందరి నేతల మాట.
ఈ వాదనను తోసిపుచ్చినవాళ్లు లేకపోలేదు. ఎన్టీఆర్ తర్వాత ఆ ఫ్యామిలీలో ఎవరూ పార్టీకి సంబంధించి ఎలాంటి బాధ్యతలు తీసుకోలేదు. ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి బాలకృష్ణకు ఇచ్చే అవకాశముందని అంటున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి కాస్తో కూస్తో యాక్టివ్‌గా ఉన్నది బాలయ్య ఒక్కరే. ఆయనకు ఈ పదవి ఇవ్వకుండా ద్వారా ఎన్టీఆర్ ఫ్యామిలీకి ప్రయార్టీ ఇచ్చినట్టు అవుతుందని అంటున్నారు. మొత్తానికి రానున్న రోజుల్లో టీడీపీలో కీలక మార్పులు చోటు చేసుకోవడం ఖాయమన్నమాట.