తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై అధికారికంగా ప్రకటన వెలువడినప్పటికీ.. ఎన్ని రోజులు నిర్వమిస్తారనేదానిపై స్పష్టత లేదు.
కాగా, డిసెంబర్ 9న నిర్వహించే బీఏసీ సమావేశంలోనే అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేదానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన విధి విధానాల రూపకల్పనపై మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే పలు అంశాలతో కూడిన సిద్ధం చేసినట్లు సమాచారం.
ఈ అంశాలను అసెంబ్లీ చర్చించి రైతు భరోసా నిధులను అర్హులైన రైతులకే అందేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అంతేగాక, కొత్తగా ఆర్వోఆర్ చట్టంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న కులగణన సర్వే ద్వారా వచ్చే వివరాలను కూడా అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు, ప్రతిపక్షాలు కూడా ఈ సమావేశాలు పలు అంశాల్లో అధికార పక్షాన్ని నిలదీసే అవకాశం ఉది.
గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కేసులు, వికారాబాద్ జిల్లాలో లగచర్ల ఘటన, రైతు భరోసా నిధులు, సన్న ధాన్యానికి రూ. 500 బోనస్ సమావేశాల్లో చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. ఇక, బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్.. ఆరోజు సెషన్స్ ముగిసిన తర్వాత వెళ్లిపోయారు. ఆ తర్వాత సమావేశాలకు హాజరుకాలేదు. అయితే, ఈ అసెంబ్లీ సమావేశాలకైనా కేసీఆర్ ప్రతిపక్ష నేతగా హాజరవుతారా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది. ఒకవేళ అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ వస్తే చర్చలు వాడీవేడిగా సాగే అవకాశం తప్పదు.