భారత రక్షణ వ్యవస్థకు అదనపు బలం.. డిఫెన్స్ రంగంలో గేమ్‌ఛేంజర్‌గా సీ 295 ఎయిర్ క్రాఫ్ట్..

భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రైవేట్ కంపెనీలు రంగంలోకి దిగుతున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్‌లోని వడోదరలో తొలి ప్రైవేట్ సైనిక రవాణా విమానాల తయానీ ప్లాంట్‌ను ప్రధాని మోదీ స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్‌లు కలిసి ప్రారంభించారు. ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ సంస్థ భారత్‌కు రావడం ఇది తొలిసారి. వివిధ ప్రాంతాల నుంచి విడిభాగాలన్నీ తీసుకొచ్చి ఒకచోటనే విమానంను తయారు చేయడం ప్రైవేట్ ఏవియేషన్ ఇండస్ట్రీలోనే ఇది తొలిసారి కావడం విశేషం.అంటే ఇక్కడ ఫ్యాక్టరీలో తయారైన విమానం నేరుగా గాల్లోకి ఎగురుతుందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి.

 

టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) క్యాంపస్‌లో ఉన్న ఈ ఏవియేషన్ ఫ్యాక్టరీలో C295 ఎయిర్‌బస్‌లను తయారు చేస్తారు.దీంతో విమానయాన రంగంలో భారత్‌‌ ఒక మైలురాయిని చేరినట్లు అవుతుంది. మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా తయారయ్యే ఎయిర్‌క్రాఫ్ట్‌లు కచ్చితంగా భారత్‌కు గేమ్‌ఛేంజర్‌గా మారుతాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.అంతేకాదు ఈ విమానయాన తయారీ సంస్థ భారత్‌కు రావడంతో ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎగుమతి చేయడంలో ఊతమిస్తుందని అన్నారు. ఇక C295 ఎయిర్ క్రాఫ్ట్‌ భారత్‌కు గేమ్ ఛేంజర్‌గా ఎలా నిలుస్తుందో చూద్దాం.

 

భారత రక్షణ వ్యవస్థకు అదనపు బలం

 

C295 ఎయిర్ క్రాఫ్ట్‌ భారత వైమానిక దళంలో చేరితే ఇప్పటికే ఉన్న వ్యవస్థకు ఇది అదనపు బలంగా మారబోతోంది. ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థ తయారు చేస్తున్న ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఎన్నో మిషన్స్‌ను విజయవంతంగా పూర్తి చేయగలదు. ఉదాహరణకు పెద్ద ఎత్తున సైనికులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేర్చడం, భారీ కార్గోలను రవాణా చేయడం,అత్యవసర సమయాల్లో ప్రజలను ఖాళీ చేయించడం, సముద్రతీరంలో గస్తీలాంటి టాస్క్‌లు పూర్తిచేయగలిగే సామర్థ్యం C295 ఎయిర్ క్రాఫ్ట్‌‌కు ఉంది.ఈ ఎయిర్‌క్రాఫ్ట్ సోవియట్ ఆంటోనవ్ ఏఎన్-32,హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ యావ్రో 748‌లకు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. అంతేకాదు యావ్రో 748 ఎయిర్‌క్రాఫ్ట్‌తో పోలిస్తే సాంకేతికంగా మరింత అడ్వాన్స్‌డ్‌గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

 

అతి తక్కువగా ఉన్న రన్‌వేపై లేదా ఎగుడు దిగుడుగా ఉన్న భూమిపై కూడా ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేట్ అవడం కలిసొచ్చే అంశం. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో, చైనాతో వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న ప్రాంతాల్లో ఈ విమానం ఆపరేట్ చేయడం సులభతరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గంటకు 482 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలిగే ఈ ఎయిర్ క్రాఫ్ట్.. ఒకేసారి 71 మంది సైనికులను, 48 మంది పారా ట్రూపర్లను,9 టన్నుల సామగ్రిని మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉంది. జంట టర్బో ప్రొపెల్లర్స్ కలిగున్న ఈ విమానం గాల్లో ఉండగానే సామగ్రిని కిందకు పంపడం, ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఆరోగ్య విపత్తు సమయాల్లో, సముద్రతీరాల్లో ప్యాట్రోలింగ్,గాల్లోనే ఇంధనం నింపుకోవడం వంటి ఫీచర్స్‌ ఉండటంతో భారత త్రివిధ దళాలు ఈ ఎయిర్ క్రాఫ్ట్‌ను రికమెండ్ చేస్తున్నాయి.

 

మేకిన్ ఇండియాకు ఊతమిచ్చేలా..

మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇక దిగుమతులను తగ్గించుకునేలా కార్యాచరణ రూపొందించింది.స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యే ఉత్పత్తులను ప్రమోట్ చేసేందుకు ప్రతిజ్ఞ తీసుకుంది.C-295 కార్యక్రమంలో భాగంగా ముందుగా 56 ఎయిర్ క్రాఫ్ట్‌లను తయారు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో ముందుగా ఎయిర్‌బస్ సంస్థ స్పెయిన్‌ యూనిట్‌లో తయారు చేసిన C295 ఎయిర్ క్రాఫ్ట్‌‌లను భారత్‌కు డెలివరీ చేయనుంది.మిగతా 40 ఎయిర్‌క్రాఫ్ట్‌లు వడోదర ప్లాంట్‌లో తయారు చేస్తారు.

 

ఇప్పటి వరకు ఐదు C295 ఎయిర్ క్రాఫ్ట్‌‌లు భారత వాయుసేనలో ఉన్నాయి. సెప్టెంబర్ 2023లొ తొలి C295 ఎయిర్ క్రాఫ్ట్‌ భారత్‌లో ల్యాండ్ అయ్యింది.భారత్‌లో తయారయ్యే తొలి C295 ఎయిర్ క్రాఫ్ట్‌‌ను 2026 సెప్టెంబర్‌లో ఎగిరేలా సన్నాహాలు చేస్తున్నారు.మిగతావి 2031 ఆగష్టు కల్లా పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఇక ఈ ప్లాంట్ కార్యకలాపాలు ప్రారంభమైతే స్థానికంగా ఉద్యోగాల కల్పన ఉంటుంది. ఏరోస్పేస్ ఇండస్ట్రీ సాధారణంగా దక్షిణభారత రాష్ట్రాల్లోని బెంగళూరు, హైదరాబాదు, బెల్గాం నగరాలకు పరిమితమవగా.. తాజాగా వడోదరలో వస్తున్న ప్లాంట్ మరో కలికితురాయిగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఈ ప్లాంట్ ప్రారంభమైతే ప్రత్యక్షంగా 3వేల ఉద్యోగాలు, పరోక్షంగా 15వేల ఉద్యోగాలు వస్తాయనే అంచనా ఉంది.

 

ఇక భారత్‌ అవసరాలకు తగ్గట్టుగా 56 ఎయిర్ క్రాఫ్ట్‌లు తయారయ్యాక, ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థ మరిన్ని ఎయిర్ క్రాఫ్ట్‌లను తయారు చేసి భారత ప్రభుత్వం అనుమతించిన ఇతర దేశాలకు ఎగుమతి చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.తద్వారా మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా విమానాయాన రంగంలో భారత్ కూడా కీలక దేశంగా మారుతుంది. ఏరోస్పేస్ ఇండస్ట్రీని ప్రస్తుతం అమెరికా,ఐరోపా దేశాల ఆధిపత్యం కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *