ఏపీలో తిరుమల లడ్డూ వివాదం తెరపైకి వచ్చాక డిక్లరేషన్ వివాదం కూడా అంతే కలకలం రేపుతోంది. గతంలో సీఎంగా ఉండగా ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వకుండానే ఐదేళ్ల పాటు తిరుమలకు వెళ్లిన వైఎస్ జగన్ ను తాజాగా కూటమి సర్కార్ షాకిచ్చింది. డిక్లరేషన్ ఇస్తేనే తిరుమలలో ఎంట్రీ ఇస్తామని తేల్చిచెప్పేసింది. దీంతో జగన్ తిరుమల పర్యటనను సైతం రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో డిక్లరేషన్ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది.
ఇదే అంశంపై నిన్న, ఇవాళ సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు స్పందించారు. ఎక్స్ లో నిన్న తిరుమల లడ్డూ, డిక్లరేషన్ వివాదాలపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలయాలు హిందువుల కోసమేనని, హిందూయేతరుల కోసం కాదని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఏపీ దేవాదాయచట్టంలో హిందువులన్న పదానికి ఉన్న నిర్వచనం గుర్తుచేస్తూ.. తిరుమల దర్శనం కోసం వచ్చే హిందూయేతరులు తమకు శ్రీవారిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ పై సంతకం చేయడంతో పాటు మతం కూడా మార్చుకోవాలని సూచించారు. ఈ మేరకు చట్ట సవరణ చేయాలని సీఎం చంద్రబాబును కోరారు.
ఇవాళ మరో పోస్టు పెడుతూ అందులో వైఎస్ జగన్ కు ఓ సూచన చేశారు. జగన్ గారూ, దేవాలయాలు హిందువులకు మాత్రమే చెందుతాయి. అవి హిందువేతరులకు హద్దులు దాటిపోయాయి. క్రైస్తవులుగా మీరు ఏ దేవాలయంలోకి ప్రవేశించలేరు. మీకు అంత ఆసక్తి ఉన్నట్లయితే, మీరు మొదట మీ పూర్వీకుల మతం అయిన హిందూ మతానికి తిరిగి మతం మార్చడం ద్వారా #ఘర్వాపసి చేయండి. అప్పుడు హిందువులు మిమ్మల్ని ఆలయాలకు #పూర్ణ_కుంభంతో స్వాగతిస్తారంటూ ముగించారు.