రెండు రాష్ట్రాల్లో బీఆర్ఎస్, వైసీపీ అధ్యక్షులు అధికారం శాశ్వతమన్న ధీమాతో వ్యవహరించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనన్న నమ్మకంలో వ్యవహరించారు. అయితే కేసీఆర్, జగన్‌ల అతినమ్మకమే వారి కొంప ముంచింది. ఓటమిపై విశ్లేషణలు చేసుకుని తిరిగి పార్టీలను గాడిలో పెట్టుకోవాల్సిన ఆ ఇద్దరు మాజీలు ఆ పని మాత్రం చేయడం లేదు. ఫాంహౌస్‌కు పరిమితమైన కేసీఆర్ తిరిగి తన సైన్యంతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టించే పనిలో పడ్డారు.. ఇటు జగన్‌తో పాటు బీఆర్ఎస్ నేతలేమో ఏమో అప్పుడే తిరిగి అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారు. దాంతో రెండు రాష్ట్రాల్లో ఒకే రకమైన డైలాగులు రీ సౌండ్ ఇస్తున్నాయి. అసలు వారి లెక్కలేంటి?
పదేళ్లు తెలంగాణను ఏలిన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హ్యాట్రిక్ విజయం ఖాయమని బోల్డు నమ్మకంతో కనిపించారు. తన వారసుడు కేటీఆర్‌కి ముఖ్యమంత్రి పగ్గాలు ఇచ్చేసి.. తాను జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి స్కెచ్ గీసుకున్నారు. పార్టీ పేరులో నుంచి తెలంగాణను బీఆర్ఎస్‌గా మార్చి హాడావుడి చేశారు. పార్టీ పేరులో తెలంగాణ తీసేసిన ఎఫెక్టో? ఏమో? కాని ఆయనకు సెంటిమెంట్ రివర్స్ అయి ఫాంహౌస్‌కు పరిమితమవ్వాల్సి వచ్చింది.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అయితే ప్రగతి భవన్, లేకపోతే ఫాం హౌస్‌లోనే ఉంటూ రాజ్యాధికారం చెలాయించారు. ఇప్పుడు పార్టీ వ్యవహారాలను కూడా ఆయన ఆయన అక్కడ నుంచే గౌడ్ చేస్తున్నారంటున్నారు. ఇటీవల కౌశిక్‌రెడ్డి రచ్చ వెనుక కేసీఆర్ డైరెక్షన్ ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి మళ్లీ సెంటిమెంట్ పండించి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది పొందాలన్నది గులాబీ బాస్ వ్యూహంగా కనిపిస్తుంది.
ఆ క్రమంలో గెలవకగెలవక మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి .. ఆంధ్రా సెటిలర్లు.. అంటూ రచ్చ మొదలుపెట్టారు. గెలవడం కోసం ఆత్మహత్య అస్త్రం ప్రయోగించి.. ఎలాగోలా గట్టెక్కిన కౌశిక్‌రెడ్డి తన ఎపిసోడ్‌కు కొనసాగింపుగా ఇప్పుడు సరికొత్త వార్నింగులు ఇస్తున్నారు. మరి ఆయన నమ్మకం ఏంటో కాని.. వచ్చే ఎన్నికల్లో గెలవబోయేది తామే అని తమ అధ్యక్షుడు కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్నట్లు జోస్యం చెప్తూ.. పోలీసులకు వార్నింగులు ఇచ్చేస్తున్నారు.
అటు చూస్తే జగన్ కూడా అదే పల్లవి వల్లె వేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే.. అక్క చెల్లెమ్మల ఓట్లు, అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయో అంటూ బేల ముఖం పెట్టిన ఆయన ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చేది తానే అనేస్తున్నారు. లోకేష్ రెడ్ బుక్ గురించి ప్రస్తావిస్తూ.. తామూ రెడ్‌బుక్ మెయిన్ టెయిన్ చేయగలమని.. తాము అధికారంలోకి వచ్చాక అందరితో ఊచలు లెక్కపెట్టిస్తామని వార్నింగులు ఇస్తున్నారు.
జగన్, కేసీఆర్‌ల సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం. అప్పుడు 2014 ఎన్నికల సమయంలో.. ఇప్పుడు 2024 ఎన్నికల్లో జగన్ సీఎం అవుతారని జోస్యం చెప్పిన కేసీఆర్.. తమ ఇద్దరి మధ్య ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు వారిద్దరు మాజీ సీఎంలై ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లకు పైగా టైం ఉంది. అయినా రెండు పార్టీలు రెపోమాపో అధికారంలోకి వచ్చేస్తున్నట్లు స్టేట్‌మెంట్లు ఇస్తున్నాయి. వారి డైలాగులతో ఆ ఫ్రెండ్స్ ఇద్దరూ ఓడిపోయాక కూడా ఒకరిని ఒకరు ఫాలో అవుతూనే ఉన్నారన్న టాక్ వినిపిస్తుంది.