ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా కీలక ప్రకటన చేశారు. వరద బాధితులను ఆదుకుంటామని చెప్పారు. వరదల్లో నష్టపోయిన ప్రతి ఇంటికి రూ. 25 వేల ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. గతంలో అయితే, కేవలం రూ. 4 వేలు మాత్రమే ఇచ్చేవారని అన్నారు. కానీ, దానిని ప్రస్తుతం రూ. 25 వేలకు పెంచినట్లు చెప్పారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నవారికి రూ. 10 వేల ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఇటు నష్టపోయిన ఆటో డ్రైవర్లకు రూ. 10 వేల ఆర్థిక సాయం చేస్తామని స్పష్టం చేశారు. 179 సచివాలయాలు, 32 వార్డుల్లోని గ్రౌండ్ ఫ్లోర్లలో వారందరికీ రూ. 25 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. చేనేత కార్మికులు పూర్తిగా నష్టపోతే వారికి కూడా రూ. 25 వేలు ఇస్తామని చెప్పారు. అటు నష్టపోయిన పరిశ్రమలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నష్టపోయిన పరిశ్రమలకు టర్నోవర్ ఆధారంగా ఆర్థికసాయం చేస్తామన్నారు.
మంగళవారం ఆయన సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. ‘వర్షాలు, వరదల కారణంగా ఇళ్లు కోల్పోయినవారిని కూడా ఆదుకుంటాం. వారికి ఇళ్లు కట్టిస్తాం. ప్రతి ఇంటికి రూ. 25 వేల ఆర్థిక సాయం చేస్తాం. చిరువ్యాపారులకు కూడా రూ. 25 వేల ఆర్థిక సాయం చేస్తాం. మొదటి అంత్తస్తుల్లో ఉండేవారికి రూ. 10 వేలు ఇస్తాం. ఇళ్లలోకి నీళ్ల వచ్చినవారికి కూడా రూ. 10 వేలు ఇస్తాం. మత్స్యకార్మికులను కూడా ఆదుకుంటాం. ఫిషింగ్ బోట్, నెట్ పాక్షికంగా డ్యామేజైతే వారికి రూ. 9 వేలు ఇస్తాం. ఒకవేళ అవి పూర్తిగా డ్యామేజ్ అయితే వారికి రూ. 20 వేల ఆర్థిక సాయం చేస్తాం. పశువులు మృత్యువాతపడితే యజమానులకు రూ. 50 వేలు ఇస్తాం. సెరీ కల్చర్ కు రూ. 6 వేలు అందజేస్తాం. ఇటు రైతులను కూడా ఆదుకుంటాం. వరికి ఎకరాకు చొప్పున రూ. 10 వేలు అందజేస్తాం. ఇటు చెరకుకు కూడా రూ. 25 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తాం’ అంటూ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
‘చేనేత కార్మికులకు కూడా సాయం చేస్తాం. వారికి రూ. 15 వేలు ఇస్తాం. అదేవిధంగా నష్టపోయిన ఎంఎస్ఎంఈలను కూడా ఆదుకుంటాం. రూ. 40 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలకు రూ. లక్ష వరకు ఆర్థిక సాయం చేస్తాం. అంతకుపైగా ఉంటే వారికి రూ. 1.5 లక్షల సాయం చేస్తాం. కోళ్ల ఫారాల ఓనర్లను కూడా ఆదుకుంటాం. కోళ్ల షెడ్డు ధ్వంసమైతే వారికి రూ. 5 వేలు ఇస్తాం. అదేవిధంగా ఒక్కో కోడికి రూ. 100 చొప్పున చెల్లిస్తాం. పశువులకు రూ. 50 వేలు ఇస్తాం. ఎద్దులకు రూ. 40 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తాం. అదే దూడలకైతే రూ. 25 వేలు ఇస్తాం. గొర్రెలకు కూడా రూ. 7500 ఇస్తాం. ఎవరైనా ఎడ్లబండ్లు కోల్పోతే వారికి కొత్తవి కొనిస్తాం. ఇటు పత్తి రైతులను కూడా ఆదుకుంటాం. హెక్టారు చొప్పున వారికి రూ. 25 వేలు అందజేస్తాం. వేరుశనగకు కూడా రూ. 25 వేల చొప్పున అందజేస్తాం. ఇటు పసుపు, అరటి తోటల యజమానులను కూడా ఆదుకుంటాం. వారికి రూ. 35 వేలు చొప్పున సాయం చేస్తాం. ఇతర పంటలకు హెక్టారుకు రూ. 15 వేలు అందజేస్తాం. టూ వీల్లర్ వాహనదారులు రూ. 71 కోట్ల వరకు క్లెయిమ్ లు చేశారు. అందుకోసం రూ. 6 కోట్లు చెల్లించాం. ఇంకా 6 వేల క్లెయిమ్ లు పెండింగ్ లో ఉన్నాయి. వాటికి కూడా త్వరలోనే చెల్లిస్తాం’ అంటూ చంద్రబాబు వెల్లడించారు