బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా..!

ఏపీ రాజకీయాల్లో ముంబయి నటి కాదంబరీ జెత్వానీ అక్రమ అరెస్టు వ్యవహారం సంచలనమైంది. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు పై ఏపీ పోలీసులు జెట్ స్పీడ్‌తో ముంబయి వెళ్లి జత్వానీని అరెస్టు చేశారు. తన స్థలాన్ని ఫోర్జరీ సంతకాలతో జత్వానీ వేరే వాళ్లకు అమ్ముతున్నారని విద్యాసాగర్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన ఫిబ్రవరి 2వ తేదీనే ముంబయికి వెళ్లి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. 42 రోజులపాటు తనను జైలులో ఉంచారని జత్వానీ ఆరోపించారు. తనకు ఏపీకి సంబంధమే లేదని, తాము ఎప్పుడూ ఏపీకి వెళ్లలేదని, అక్కడ భూములూ తమకు లేవని స్పష్టం చేశారు. ఆ ఫిర్యాదు అర్థరహితం, అహేతుకం అని కొట్టిపారేశారు.

 

ఇబ్రహీంపట్నం పీఎస్‌లో ఆమె ఇటీవలే ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. జత్వానీపై కేసు వ్యవహారానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ అధికారులు నితీశ్ రాణా, విశాల్ గున్ని,పీఎస్ఆర్ ఆంజనేయులపై సస్పెన్షన్ వేటు వేసింది. అంతకు ముందు ఇద్దరు పోలీసులపైనా యాక్షన్ తీసుకుంది.

 

తాజాగా కాదంబరి జత్వానీ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. తనపై కేసు పెట్టడానికి గల కారణం, దాని వెనుక ఉన్న కుట్రను ఆమె బట్టబయలు చేశారు. తన అరెస్టు ఒక పద్ధతి ప్రకారం, వారికి అవసరమైన కీలక సమయంలోనే అరెస్టు చేసినట్టు వివరించారు.

 

తాను ముంబయిలో ఓ కార్పొరేట్ బాస్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టానని కాదంబరి జత్వానీ వివరించారు. ఆ కేసు హియరింగ్ ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 9వ తేదీ మధ్యలో ఉందని, సరిగ్గా ఈ సమయంలో తాను అక్కడ లేకుండా చేశారని తెలిపారు. ఫిబ్రవరి 3వ తేదీన తనను అరెస్టు చేశారని, 42 రోజులపాటు జైలులో ఉంచారని వివరించారు. ఇలా చేయడం వల్ల తాను ముంబయిలో ఓ కార్పొరేట్ బాస్ పై పెట్టిన కేసు క్లోజ్ అయిందని తెలిపారు. తనపై ఇక్కడ తప్పుడు కేసు పెట్టడం ఆ ముంబయి నిందితుడిని తప్పించడానికేనని తాను నమ్ముతున్నట్టు పేర్కొన్నారు.

 

తనపై కేసు వెనుక రాజకీయ ప్రేరేపణలు, డబ్బు చేతులు మారడం చాలా జరిగందని, లేదంటే.. ఈ స్థాయిలో డ్రామా ఉండేది కాదని జత్వానీ తెలిపారు. ఆ కార్పొరేట్ బాస్ పై డిసెంబర్‌లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని, అందుకే ఈ డ్రామా అంతా జరిగిందని పేర్కొన్నారు. తనపై ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకుడికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన పనే లేదని, కానీ, ఆయన బాస్‌ ఆదేశాల ఇది చేశాడని ఆరోపించారు. ఈ కేసులోనూ చాలా అవకతవకలు ఉన్నాయని, అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి ముందే తనను అరెస్టు చేసి ఏపీకి తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఆ పోలీసు ఉన్నతాధికారులు కూడా అధికార దుర్వినియోగం కారణంగానే తనను అరెస్టు చేశారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *