మేడిగడ్డ బ్యారేజ్ దర్యాప్తు.. మధ్యంతర రిపోర్టు.. !

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై దర్యాప్తు చేసిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం తన మధ్యంతర నివేదికను సోమవారం న్యాయ విచారణ కమిషన్‌కు అందజేసింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపైనా నివేదికలు ఇవ్వాలని కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఆదేశించారు. నివేదికలో 21 మంది ఇంజినీర్లను బాధ్యులుగా పేర్కొన్నట్లు తెలుస్తోంది.

 

కేసీఆర్ ప్రభుత్వం హయాంలో నిర్మించారు మేడిగడ్డ బ్యారేజ్. ఎన్నికలకు ముందు ఈ ప్రాజెక్టు కుంగింది. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీంతో డీజీగా ఉన్న రాజీవ్‌రతన్ బ్యారేజ్‌కు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.

 

మేడిగడ్డతో సంబంధం ఉన్న ఇంజనీర్లను పిలిచి విచారించారు. ఈ విచారణలో అనేక అంశాలపై లోపాలు బయటపడ్డాయి. ఆ తర్వాత విజిలెన్స్ దర్యాప్తు ముందుకు సాగలేదు. ఈ క్రమంలో నివేదికను తమకు అందజేయాలని జస్టిస్ పీసీ ఘోస్ కమిటీ, విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించింది.

 

ఇటీవల విజిలెన్స్ డీజీగా అదనపు బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్, మధ్యంతర నివేదికను రెడీ చేసి సోమవారం పీసీ ఘోష్ కమిటీకి అందజేశారు. మొత్తం 21 మంది ఇంజనీర్ల పాత్రను గుర్తించారు. అందులో ఎవరు ఏమేమి చేశారన్న దానిపై నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం.

 

దీనికితోడు అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లపై నివేదికను ఇవ్వాలని ఘోష్ కమిటీ ఆదేశించింది. విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా బుధవారం(రేపటి) నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ మొదలుపెట్టాలని ఘోష్ కమిటీ నిర్ణయించినట్టు సమాచారం. తొలుత రిటైర్డ్ ఇంజనీర్లను పలిచి విచారణ చేయనుంది. వీరు చెప్పిన వివరాలు ప్రకారం గత ప్రభుత్వంలోని మరికొందరికి నోటీసులు జారీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇంజనీర్లు విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *