మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్‌లో ఓంకారేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఆలయ అభివృద్ధి పనుల కోసం ఏకంగా 1,108.27 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ గత అక్టోబర్ 7న జీవో నంబర్ 928ని జారీ చేసింది. అయితే ఈ ఖర్చుపై ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్’ సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు MRDCL చైర్‌పర్సన్‌కు లేఖ రాస్తూ.. తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే పునఃపరిశీలించాలని డిమాండ్ చేసింది.
రాష్ట్రంలో ఇప్పటికే వేల కోట్ల రూపాయలను వివిధ ఆధ్యాత్మిక, ఉత్సవాల కోసం కేటాయిస్తున్నట్లు ఫోరం తన లేఖలో పేర్కొంది. వచ్చే ఏడాది జూలైలో జరిగే గోదావరి పుష్కరాల కోసం ఇప్పటికే 1,000 కోట్లు కేటాయించామని ప్రభుత్వం తెలిపింది. గోదావరి తీరంలోని ఆలయాల అభివృద్ధికి మొత్తం 2,500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారని గుర్తుచేసింది. ఇందులో భాగంగానే భద్రాచలం ఆలయ అభివృద్ధికి 276 కోట్లు, బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి 354 కోట్లు కేటాయించారని.. ఇక సమ్మక్క-సారలమ్మ జాతర కోసం దాదాపు 800 కోట్లు ఖర్చు చేశారని ఆ లేఖలో ప్రస్తావించింది.
ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని, ఇలాంటి తరుణంలో మతపరమైన కార్యక్రమాలు, ఆలయాల అభివృద్ధి కోసం వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేయడం సరైన ప్రాధాన్యత కాదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వాదిస్తోంది. ప్రజలకు అత్యవసరమైన ఆరోగ్యం, విద్య, మౌలిక వసతుల కల్పనకు నిధులు ఎంతో అవసరమని స్పష్టం చేసింది. కాబట్టి ఓంకారేశ్వర ఆలయ అభివృద్ధి కోసం కేటాయించిన రూ.1,108 కోట్ల పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తోంది.