సిద్దిపేట వేదికగా రక్షణసేన బిగ్ ప్లాన్..! కవితా కేడర్‌లో కొత్త జోష్..!

రాష్ట్ర రాజకీయాల్లో తన ఉనికిని మరింత విస్తరించేందుకు రక్షణసేన కార్యాచరణకు పదును పెడుతోంది. ఇప్పటివరకు రాష్ట్ర పార్టీ కార్యాలయం కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తుంది. జిల్లాల పర్యటనకు వెళ్తున్నప్పటికీ పార్టీ కార్యాలయాలు లేవు. అయితే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో పార్టీని ప్రజలకు చేరువ చేయడంతోపాటు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా శాశ్వత కార్యాలయాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

పార్టీ విస్తరణ కార్యక్రమానికి సిద్దిపేట వేదిక కానుంది. ఈ నెల 13న సిద్దిపేటలోని రంగధాంపల్లి చౌరస్తా వద్ద పార్టీ కార్యాలయ నిర్మాణానికి రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత భూమిపూజ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేపట్టేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. భూమిపూజతోపాటు సుమారు 2 నుంచి ఐదువేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

పార్టీని కేవలం ఎన్నికల సమయంలోనే ప్రజల్లోకి తీసుకెళ్లకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే రాజకీయ శక్తిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కార్యాలయాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాల్లో కార్యాలయాలు అందుబాటులోకి వస్తే స్థానిక సమస్యలపై స్పందించడం, కార్యకర్తలతో సమన్వయం, పార్టీ కార్యక్రమాల నిర్వహణకు అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. సిద్దిపేటలో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్త విస్తరణకు నాంది కానుంది.

ఈ నెల 13న నిర్వహించే కార్యక్రమాన్ని పార్టీ బలప్రదర్శనగా కాకుండా సంస్థాగత విస్తరణకు సంబంధించిన కీలక సమావేశంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సభకు ఐదువేల మందిని సమీకరించడమే లక్ష్యంగా పార్టీ కేడర్ పనిచేస్తోంది. సభా ప్రాంగణం, వేదిక, జన సమీకరణ, ఇతర ఏర్పాట్లపై స్థానిక నాయకులు దృష్టి సారించారు. పార్టీ ముఖ్య నాయకుల ప్రసంగాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రకటనలు ఈ సభలో ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

మరోవైపు, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోనూ సిద్దిపేట కార్యక్రమానికి ప్రాధాన్యం ఏర్పడింది. పార్టీ కార్యాలయ భూమిపూజ, బహిరంగ సభ అనంతరం ఎన్నికల ప్రచార కార్యక్రమాలను కూడా ఇక్కడి నుంచే ప్రారంభించేందుకు పార్టీ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. సంస్థాగత విస్తరణతోపాటు ఎన్నికల సన్నాహాలను సమాంతరంగా ముందుకు తీసుకెళ్లాలన్నది పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ నెల 13న సిద్దిపేటలో జరగనున్న భూమిపూజ, బహిరంగ సభ రక్షణసేన రాష్ట్రవ్యాప్త విస్తరణ కార్యక్రమంలో కీలక ఘట్టంగా నిలవనుంది. జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ఏర్పాటు, కేడర్ సమీకరణ, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. ఈ మూడు అంశాల చుట్టూ పార్టీ తదుపరి రాజకీయ కార్యాచరణ సాగనుంది. ఇప్పటికే కవిత ఉమ్మడి జిల్లాల పర్యటనలు చేశారు. ప్రాజెక్టులతోపాటు ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగితెలుసుకున్నారు. అయితే పర్యటనలకు వెళ్లినప్పడు అక్కడ పార్టీ కార్యాలయాలు లేకపోవడం, స్థానిక సంస్థలపై గళమెత్తేందుకు నేతలంతా చర్చించేందుకు ఇబ్బందులు కలుగుతుండటం, రాబోయే ఏ ఎన్నికలకు అయినా పార్టీ కార్యాలయాలు కీలకం అని భావించి ప్రతి జిల్లాలో ఉండేలా ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నారు.