జగన్‌కు మళ్లీ కొత్త టెన్షన్..! ఏం జరిగిందంటే..?

ఏపీలో ఈనెల 13 నుంచి పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత సహకార సంఘాల సొసైటీ ఎన్నికలకు కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ రెండింటికి మధ్య పులివెందులకు ఉప ఎన్నిక రావచ్చని కూటమి పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు. అదే జరిగితే వైసీపీ అధినేత జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారనుంది.

పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం ఖాయంగా కనిపిస్తోంది. దానికి సంబంధించి అడుగులు చకచకా వేస్తోంది కూటమి ప్రభుత్వం. ఉన్నట్లుండి పులివెందుల నియోజకవర్గానికి బైపోల్ ఏంటని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం. అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ కంచుకోటలు బద్దలయ్యాయి. ఇలాంటి సమయంలో బైపోల్ కు వైసీపీ అధినేత రెడీ అవుతారా? అన్నది అసలు ప్రశ్న.

వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ సమావేశాలకు కంటిన్యూ 59 రోజులపాటు హాజరుకాలేదు. మరొక రోజు హాజరుకాకుండా సభ్యత్వం రద్దు అయ్యే అవకాశం ఉంది. సమావేశాలకు వరుసగా 60 రోజులు హాజరు కాకపోతే దానిపై స్పీకర్ నిర్ణయం తీసుకుని అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో డిసెంబర్‌లో జరగనున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరవుతారా? అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్.

ఒక్కరోజు జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుంటే అసెంబ్లీ రూల్స్ ప్రొసీజర్ ప్రకారం..  ఆ అభ్యర్థిని డిస్ క్వాలిఫ్లై చేసే అధికారం స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ఉంది. ఈ విషయంలో స్పీకర్.. ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఈసీ నిర్ణయం తీసుకోవచ్చు. గవర్నర్ ప్రసంగాన్ని పరిగణనలోకి తీసుకోరని తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో వైసీపీ కంచుకోటలపై సైకిల్ జెండా రెపరెపలాడుతోంది. ఇలాంటి సమయంలో జగన్, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న చర్చ అప్పుడే ఏపీ రాజకీయాల్లో మొదలైంది.

జగన్‌కు రెండే దారులు ఉన్నాయి. శీతాకాలం అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం, బైపోల్‌కు వెళ్లడం. అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే భయపడి హాజరైనట్టు పరిగణిస్తారు. అటెండ్ కాకుంటే దైర్యంగా నిలబడినట్టే. ఈ రెండింటిలో జగన్ ఎటువైపు మొగ్గు చూపుతారో. బైపోల్ వస్తే పులివెందులకు మళ్లీ పండగ. మరో ఆరు నెలల్లో పాదయాత్రకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు వైసీపీ అధినేత. స్పీకర్ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలచుకుని పాదయాత్రలో ఈ అంశాన్ని లేవనెత్తాలన్నది ఆ పార్టీ ఆలోచనగా చెబుతున్నారు. మొత్తానికి జగన్‌ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నచందంగా మారింది.