ఢిల్లీని కమ్మేసిన విషవాయువులు..!

దీపావళి వేడుకల తర్వాత దేశ రాజధాని ఢిల్లీ విషవాయువులతో ఉక్కిరిబిక్కిరవుతోంది. నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేయడంతో పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత తీవ్ర స్థాయికి పడిపోయింది. ఈ పరిస్థితిపై అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) మధ్య మాటల యుద్ధం మొదలైంది. కాలుష్య తీవ్రతను ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తోందని విపక్షాలు ఆరోపిస్తుండగా.. 25 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ఆప్‌ చేసిందేమీ లేదని బీజేపీ ఎదురుదాడికి దిగింది.

ఆదివారం రాత్రి 11.05 గంటలకు ఢిల్లీ సగటు గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 373గా నమోదైంది. అలీపూర్‌, బవానా, బురారీ, చాందినీ చౌక్‌, ముండ్కా, పంజాబీ బాగ్‌, రోహిణి, వివేక్‌ విహార్‌ ప్రాంతాల్లో ఏక్యూఐ 400 దాటింది. పలు ప్రాంతాల్లో దట్టమైన పొగ కారణంగా వాహనదారులకు ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది.

కాలుష్యాన్ని కొలిచే పర్యవేక్షణ కేంద్రాలు కీలక సమయంలో డేటా చూపకపోవడంపై కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా అనుమానాలు వ్యక్తం చేశారు. ఢిల్లీలోని 39 కేంద్రాల్లో 25 చోట్ల నవంబర్‌ 9 తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య పీఎం2.5 వివరాలు అందుబాటులో లేవని పేర్కొన్నారు. కాలుష్య గణాంకాలను ప్రభుత్వం కావాలనే దాచిపెడుతోందా? పరికరాల సామర్థ్యాన్ని మించిన స్థాయిలో కాలుష్యం నమోదైందా? అని ప్రశ్నించారు. డేటా కనిపించకపోవడం వల్ల కాలుష్యం మాయమైపోదని వ్యాఖ్యానించారు.

ఆప్‌ నేత సౌరభ్‌ భరద్వాజ్‌ కూడా ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీపావళి రాత్రి కొన్ని ప్రాంతాల్లో ఏక్యూఐ 3,000 దాటిందని ఓ వీడియోను ప్రస్తావించారు. మరోవైపు బీజేపీ ఎంపీ ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ విపక్షాల ఆరోపణలను తప్పుబట్టారు. కాంగ్రెస్‌ 15 ఏళ్లు, ఆప్‌ 10 ఏళ్లు ఢిల్లీని పాలించినా కాలుష్య నియంత్రణకు తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. హిందూ పండుగలు వచ్చినప్పుడే విపక్షాలు కాలుష్యాన్ని ప్రస్తావిస్తున్నాయని ఆరోపించారు.