ఆంధ్రప్రదేశ్‌కు అండగా తెలంగాణ విద్యుత్‌ సహాయక బృందాలు..!

తుఫాన్‌ ప్రభావంతో విద్యుత్‌ వ్యవస్థ దెబ్బతిని ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం మానవీయ దృక్పథంతో ముందడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎపి విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవిలు గురువారం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు ఫోన్‌ చేసి తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ పునరుద్ధరణకు అవసరమైన సహకారం అందించాలని కోరారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు.

తుఫాన్‌ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను చంద్రబాబు నాయుడు భట్టి విక్రమార్కకు వివరించారు. తుఫాన్‌ కారణంగా పంటలకు నష్టం వాటిల్లడంతో పాటు విద్యుత్‌ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 16 వేలకు పైగా విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయని, వందల గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని వివరించారు. ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించేందుకు విద్యుత్తు సిబ్బంది, యంత్రాలు అవసరమని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వ సహాయాన్ని కోరారు. విద్యుత్‌ పునరుద్ధరణ పనులను వేగవంతం చేసేందుకు టెక్నికల్ సహయక బృందాలను, క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న విద్యుత్‌ వ్యవస్థను త్వరగా పునరుద్ధరించేందుకు కావాలసిన యంత్రాలను సమకూర్చాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ పునరుద్ధరణకు అవసరమైన సహకారం అందించడానికి సహయక బృందాలను పంపించాలని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు కోరిన విషయమై డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క సిఎం రేవంత్ రెడ్డితో చర్చించిన ఆనంతరం ఆంధ్రప్రదేశ్‌కు సహాయక బృందాలను పంపించాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, టీజీఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ జితేష్‌ వి. పాటిల్‌, ఎన్ పిడిసిఎల్ సిఎండి వరుణ్ రెడ్డిలను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరిన సహాయాన్ని అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు విద్యుత్‌ సరఫరాను వీలైనంత త్వరగా పునరుద్ధరించేలా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు టీజీఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ జితేష్‌ వి. పాటిల్‌ తక్షణ చర్యలు చేపట్టారు. విద్యుత్‌ పునరుద్ధరణ పనుల్లో పాల్గొనేందుకు ఎస్పీడీసీఎల్‌ ఉద్యోగులతో సహాయక బృందాలను సిద్ధం చేసి, ఈరోజు ఆంధ్రప్రదేశ్‌కు పంపించారు. దెబ్బతిన్న విద్యుత్‌ స్తంభాలు, లైన్ల మరమ్మతులు, విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ పనుల్లో ఈ బృందాలు సహకారం అందించనున్నాయి.

‎ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాంతీయ భేదాలకు అతీతంగా బాధితులకు అండగా నిలవాలనే మానవీయ దృక్పథంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తికి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించడం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావానికి, ప్రజల మధ్య ఉన్న ఆత్మీయ బంధానికి నిదర్శనంగా నిలుస్తోంది. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించి, ప్రజలకు సాధారణ జీవన పరిస్థితులను త్వరగా కల్పించేందుకు ఈ సహకారం దోహదపడనుంది.