బైక్ ట్యాక్సీ, ఆటో రైడ్ల కోసం రాపిడోను ఉపయోగించే వినియోగదారులకు సంబంధించిన ఫేర్ విధానంపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ (CCPA) కీలక చర్యలు తీసుకుంది. రైడ్ నిర్ధారణకు ముందే ఎక్కువ మొత్తం చెల్లించేలా వినియోగదారులను ప్రేరేపించే విధానాలు, తప్పుదారి పట్టించే ప్రకటనలు, అన్యాయ వాణిజ్య పద్ధతులు, ‘డార్క్ ప్యాటర్న్స్’ను ఉపయోగించినట్లు గుర్తించిన CCPA.. రాపిడో నిర్వహణ సంస్థ రోపెన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై రూ.10 లక్షల జరిమానా విధించింది.
CCPA వివరాల ప్రకారం.. రైడ్ బుక్ చేసిన తర్వాత డ్రైవర్ ఆ మొత్తాన్ని అంగీకరించడం లేదంటూ యాప్‌లో “హయ్యర్ ది ప్రైస్, హయ్యర్ ది ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఎ రైడ్” వంటి సందేశాలు కనిపించేవి. అలాగే అదనంగా రూ.10, రూ.20, రూ.30 చెల్లించాలని సూచించే ప్రాంప్ట్‌లు కూడా ఉన్నట్లు గుర్తించారు. రైడ్ లభించదేమోననే భావన కలిగించి ఎక్కువ చెల్లించేలా ఒత్తిడి చేయడం ‘కన్ఫర్మ్ షేమింగ్’ అనే డార్క్ ప్యాటర్న్‌కు చెందినదిగా CCPA పేర్కొంది.
ఈ తరహా తప్పుదారి పట్టించే ప్రాంప్ట్‌లు, వినియోగదారులను ఎక్కువ చెల్లించేలా ప్రేరేపించే విధానాలను నిలిపివేయాలని CCPA రాపిడోను ఆదేశించింది. క్యాబ్, బైక్-ట్యాక్సీ అగ్రిగేటర్లలో ముందస్తు టిప్పింగ్, డైనమిక్ ప్రైసింగ్ విధానాలపై నిర్వహించిన విస్తృత పరిశీలనలో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.