ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ, రేపు తిరుమలలో పర్యటించనున్నారు. సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్లనున్నారు. రాత్రి బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకోనున్నారు. అనంతరం 2027 టీటీడీ క్యాలెండర్లు, డైరీలను ప్రారంభించి, పెద్ద శేష వాహన సేవలో పాల్గొంటారు.
ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఇది 15వసారి కావడం విశేషం. 1983 నుంచి ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయం కొనసాగుతోంది. ఎన్టీ రామారావు తర్వాత అత్యధికసార్లు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిలిచారు. రేపు టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించనున్నారు.
ఇదిలా ఉండగా, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమలలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా, భక్తులు వాహన సేవలను వీక్షించేందుకు మాడవీధుల్లో 190 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సుమారు 1.80 లక్షల మంది భక్తులు వాహన సేవలను వీక్షించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది.