అన్నా హజారే తీవ్ర అస్వస్థత.. ముంబైలోని ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స

ప్రముఖ సామాజిక కార్యకర్త, గాంధేయవాది అన్నా హజారే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యం కారణంగా ఆయన్ని మహారాష్ట్రలోని రాలేగావ్‌ సిద్ధి నుంచి హుటాహుటిన ముంబైకి తరలించారు. ప్రస్తుతం ముంబైలోని బాంబే ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

89 ఏళ్ల అన్నా హజారే వైరల్ ఇన్‌ఫెక్షన్, కిడ్నీ సంబంధిత సమస్యలతో పాటు తీవ్రమైన డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. తొలుత రాలేగావ్‌ సిద్ధిలోని స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. అయితే ఆరోగ్యం మరింత క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం ముంబైలోని బాంబే ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం వైద్యుల ప్రత్యేక బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. ఐసీయూలో అవసరమైన చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నా హజారే ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలుసుకునేందుకు ఆయన అభిమానులు, అనుచరులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.