Rythu Shankaravam: ‘రైతు శంఖారావం’కు వైసీపీ నేతల అడ్డంకులు.. నంద్యాలలో పోలీసులతో ఇషాక్ బాషా వాగ్వాదం

నంద్యాల, కర్నూలు జిల్లాల్లో నిర్వహిస్తున్న ‘రైతు శంఖారావం’ కార్యక్రమానికి వైసీపీ నేతలు వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా పలువురు ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు.. ప్రధాన రహదారుల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

నంద్యాల మండలం కొత్తపల్లె వద్ద ఎమ్మెల్సీ ఇషాక్ బాషాను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, సీఐ ఈశ్వరయ్య మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రైతు శంఖారావం కార్యక్రమానికి వెళ్లేందుకు తనను అనుమతించాలని ఇషాక్ బాషా పోలీసులను కోరినప్పటికీ.. ప్రస్తుతం అక్కడికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.

అనంతరం పోలీసు బందోబస్తు మధ్య ఎమ్మెల్సీ ఇషాక్ బాషాను వెనక్కి పంపించారు. మరోవైపు జిల్లాలోని పలువురు వైసీపీ నేతలను కూడా పోలీసులు ముందస్తుగా అడ్డుకుంటుండటంతో రాజకీయంగా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.