Rana Daggubati: హీరో రానా కొత్త బిజినెస్ ప్లాన్.. చిన్న థియేటర్లతో సరికొత్త ప్రయోగం!

టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నారు. నటుడిగా, నిర్మాతగా విభిన్నమైన సినిమాలను ప్రోత్సహిస్తున్న ఆయన ఇప్పుడు థియేట్రికల్ ఎగ్జిబిషన్ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. పెద్ద మాల్స్‌లో కనిపించే మల్టీప్లెక్స్‌లకు భిన్నంగా.. కాఫీ షాప్‌కు వెళ్లిన అనుభూతిని కలిగించేలా చిన్న థియేటర్లను ఏర్పాటు చేయాలని రానా ప్లాన్ చేస్తున్నారు. ‘ది అసెంబ్లీ రూమ్స్’ పేరుతో ఈ బోటిక్ థియేటర్ కాన్సెప్ట్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా సినిమా థియేటర్ అంటే భారీ స్క్రీన్, వందలాది సీట్లు, మల్టీప్లెక్స్ వాతావరణం గుర్తుకొస్తాయి. అయితే రానా మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. తక్కువ సంఖ్యలో ప్రేక్షకులు కూర్చునేలా, పరిమిత స్క్రీన్‌లతో ఈ థియేటర్లను రూపొందించనున్నారు. ఒక్కో థియేటర్‌లో సుమారు 50 నుంచి 80 సీట్లు మాత్రమే ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సరికొత్త కాన్సెప్ట్ ప్రేక్షకులకు సినిమా చూసే విషయంలో ప్రత్యేకమైన అనుభూతిని అందించడమే లక్ష్యంగా కనిపిస్తోంది.

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా తొలి థియేటర్‌ను ఊటీలో ‘ది అసెంబ్లీ రూమ్ జిముటి’ పేరుతో నిర్మిస్తున్నారు. అలాగే హైదరాబాద్‌లో మరో థియేటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రానా వెల్లడించారు. బెంగళూరులో కూడా ఒకటి లేదా రెండు థియేటర్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రాజెక్ట్ వెనుక కేవలం వ్యాపార ప్రయోజనం మాత్రమే కాకుండా.. ఇండిపెండెంట్, ప్రత్యామ్నాయ సినిమాలకు థియేట్రికల్ స్పేస్ కల్పించడమే ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. భారీ కమర్షియల్ సినిమాల మధ్య చిన్న సినిమాలకు స్క్రీన్లు దొరకడం కష్టమవుతున్న నేపథ్యంలో.. ‘ది అసెంబ్లీ రూమ్స్’ వాటికి ప్రత్యామ్నాయ వేదికగా నిలవాలని రానా భావిస్తున్నారు.