స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఫ్యాషన్, టెక్నాలజీని కలిపి కొత్త అనుభూతిని అందించేందుకు మోటరోలా సిద్ధమవుతోంది. ప్రముఖ క్రిస్టల్ బ్రాండ్ Swarovskiతో మరోసారి భాగస్వామ్యం చేసుకుని కొత్త రేజర్ సిరీస్ ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకురానుంది. కంపెనీ విడుదల చేసిన అధికారిక టీజర్ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించింది. సెప్టెంబర్ ప్రారంభంలో జర్మనీలోని బెర్లిన్‌లో జరగనున్న IFA 2026 వేదికగా ఈ ప్రత్యేక ఎడిషన్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది.
మోటరోలా సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేసిన టీజర్లో ఫోన్ వెనుక భాగాన్ని మాత్రమే చూపించింది. నలుపు రంగు బ్యాక్ ప్యానెల్‌పై డైమండ్ ఆకారపు టెక్స్చర్తో పాటు అక్కడక్కడా మెరిసే క్రిస్టల్స్ కనిపిస్తున్నాయి. ఈ డిజైన్ గతంలో ఆన్లైన్లో లీకైన రెండర్లకు దగ్గరగా ఉండటంతో ఇది Motorola Razr 70 Swarovski Edition అయి ఉండొచ్చనే అంచనాలు బలపడుతున్నాయి.
గత ఏడాది మోటరోలా Razr 60 Swarovski Editionను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా Razr 70కు Swarovski డిజైన్‌ను జోడించనున్నట్లు తెలుస్తోంది. గత నెలలో లీకైన రెండర్ల ప్రకారం.. క్విల్టెడ్ డిజైన్‌తో కూడిన బ్లాక్ బ్యాక్ ప్యానెల్‌పై డజన్ల కొద్దీ చిన్న క్రిస్టల్స్, హింజ్ ప్రాంతంలో పెద్ద క్రిస్టల్, బయటి డిస్ప్లే కింద మరికొన్ని క్రిస్టల్ డిజైన్లు ఉండనున్నట్లు సమాచారం. ఈ ప్రత్యేక డిజైన్ ఫ్యాషన్ ప్రియులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.