తెలంగాణలో సినిమా టికెట్ ధరల నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 77పై వివాదం ముదురుతోంది. ఈ జీవో ఏకపక్షంగా ఉందని, కేవలం నిర్మాతలకు మేలు చేసేలా రూపొందించారని ఆరోపిస్తూ తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. స్టేట్ ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వంటి కీలక భాగస్వామ్య పక్షాలను సంప్రదించకుండా, కేవలం తెలుగు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
టికెట్ ధరల పెంపు వల్ల ఎగ్జిబిటర్లకు ఎటువంటి లాభం లేదని, థియేటర్ల నిర్వహణ, సిబ్బంది వేతనాలు, విద్యుత్ బిల్లులు వంటి ఆర్థిక భారాలన్నింటినీ తామే భరిస్తున్నామని వారు స్పష్టం చేశారు. కరోనా అనంతర కాలంలో ప్రేక్షకులకు మెరుగైన అనుభూతిని అందించేందుకు గత మూడేళ్లలో సుమారు రూ. 300 కోట్లు వెచ్చించి థియేటర్లను ఆధునికీకరించామని, అయితే ప్రస్తుత నిబంధనల వల్ల టికెట్ ధరలను నిర్ణయించే హక్కును కూడా కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
నూతన నిబంధనల ప్రకారం టైర్-2, టైర్-3 పట్టణాల్లోని ఎయిర్-కూల్డ్ థియేటర్లను ఏసీ థియేటర్లుగా మార్చాలంటే ఒక్కో స్క్రీన్‌కు సుమారు రూ. 60 నుండి 80 లక్షల వరకు వ్యయమవుతుందని, ఈ ఆర్థిక భారాన్ని భరించలేక ఇప్పటికే అనేక థియేటర్లు మూతపడ్డాయని వారు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 400కు పైగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉండగా, వాటిపై సుమారు 20,000 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని గుర్తుచేశారు. ఈ జీవో అమలులోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని థియేటర్లు మూతపడి, ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో, చిత్ర పరిశ్రమకు వెన్నెముకగా నిలిచే ఎగ్జిబిటర్ల ప్రయోజనాలను కాపాడే విధంగా జీవో 77ను పునఃసమీక్షించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, ఆయన చొరవ తీసుకుని తమ సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.