ఏడాదిలో ‘దేవాదుల’ పూర్తి..! రైతాంగానికి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తీపి కబురు..!

ఏడాదిలోగా దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్ట్ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికాలను ఆదేశించారు. దేవాదుల ప్రాజెక్ట్ పై మంత్రి ఉత్తమ్ అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు పొంగులేటి సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సంబంధిత అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించేలా దేవాదులను ఫాస్ట్ ట్రాక్ పై పూర్తి చేస్తామని అన్నారు.

దేవాదుల పూర్తికి అడ్డుగా ఉన్న ప్రతి సమస్యను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌, అటవీ అనుమతుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయిన చోట నిధుల విడుదలలో ఒక్కరోజు కూడా జాప్యం ఉండొద్దని పేర్కొన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ తదితర అవసరాలకు రూ.6,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీకి సీఎం హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఈ రూ.6,000 కోట్లలో ఇప్పటికే సుమారు రూ.2,500 కోట్లు విడుదల అయినట్లు ఉత్తమ్ తెలిపారు.

నిధులు విడుదల చేయడమే కాకుండా ఆ పరిహారం రైతుల చేతికి సకాలంలో చేరడం కూడా తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. కలెక్టర్లు, నీటిపారుదల ఇంజినీర్లు సమన్వయంతో పనిచేసి భూసేకరణ సమస్యలు పరిష్కరించాలన్నారు. దేవాదుల ద్వారా సుమారు 38 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసి.. దాదాపు ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమన్నారు. ఇందుకు అందుబాటులో ఉన్న పంపింగ్ వ్యవస్థలన్నింటినీ పూర్తి సామర్థ్యంతో వినియోగించాలని ఆదేశించారు.

విధానపరమైన, కాంట్రాక్టు సమస్యల పేరుతో ఇకపై దేవాదుల పనుల్లో జాప్యానికి అవకాశం ఉండకూడదని మంత్రి ఉత్తమ్ అన్నారు. దేవాదులపై ఇక నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తేల్చిచెప్పారు. అనుకున్న గడువులోగా ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. దేవాదుల ఫలాలను సాధ్యమైనంత త్వరగా రైతుల పొలాలకు చేరుస్తామని హామీ ఇచ్చారు.