కాంగ్రెస్‌లో కొండా సురేఖ వివాదం..! కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని నిర్ణయం..?

కాంగ్రెస్‌ పార్టీలో మంత్రి కొండా సురేఖ వివాదం కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంపై పార్టీ క్రమశిక్షణా కమిటీ తన నివేదికను టీపీసీసీ అధ్యక్షుడికి అందించింది. అలాగే మరో సందర్భంలో సీనియర్‌ నేత చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా కమిటీ తన అభిప్రాయాన్ని నివేదికలో పొందుపర్చినట్లు కమిటీ ఛైర్మన్‌, ఎంపీ మల్లు రవి వెల్లడించారు.

మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో వ్యక్తుల కంటే పార్టీ, క్రమశిక్షణే ముఖ్యమని స్పష్టం చేశారు. పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలను ఉపేక్షించబోమని చెప్పారు. నేతలు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ అంశాన్ని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మల్లు రవి చెప్పారు. అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని పార్టీ క్రమశిక్షణా కమిటీ ప్రతిపాదించినట్లు సమాచారం. గతంలో హెచ్చరికలు చేసినా ఆమె వైఖరిలో మార్పు రాలేదని కమిటీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. 

ఇదే సమయంలో క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్‌గా పనిచేసిన చిన్నారెడ్డిపై కూడా చర్యలకు సిఫార్సు చేసినట్లు రవి చెప్పారు. ఆయనను ప్లానింగ్‌ కమిషన్‌ నుంచి తొలగించాలని కమిటీ ప్రతిపాదించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఇద్దరు నేతలపై చర్యలు తీసుకోకపోతే పార్టీకే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని క్రమశిక్షణా కమిటీ అభిప్రాయపడినట్లు సమచారం. పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే నేతల విషయంలో కఠినంగా ఉండాలని కమిటీ సూచించినట్లు తెలుస్తోంది.

మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పరకాల అసెంబ్లీ టికెట్‌ అంశంలో సీఎం రేవంత్‌రెడ్డిని, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అభ్యర్థిని ఎన్నుకోవడానికి రేవంత్‌ రెడ్డి ఎవరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టికెట్‌ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని సవాల్‌ విసిరారు. ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సీరియస్‌గా స్పందించి సురేఖకు షోకాజ్‌ నోటీసు ఇచ్చింది. 

ఇక వనపర్తి రాజకీయాల విషయంలో చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి దారితీశాయి. తనకు కాకుండా డబ్బులకు ఆశపడి ఇతరులకు టికెట్‌ ఇచ్చారని ఆయన ఆరోపించారు. పార్టీ పరిస్థితులు ఇలాగే కొనసాగితే సీనియర్‌ నేత జీవన్‌రెడ్డిలా తాను కూడా తిరగబడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ చిన్నారెడ్డికి నోటీసు ఇచ్చింది.