ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం సోంపేటలో ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ నిర్వహించారు. సోంపేట జూనియర్ కళాశాల ఆవరణం నుంచి ప్రారంభమైన ర్యాలీ మెయిన్ రోడ్డు వరకు కొనసాగింది. విద్యార్థులు, అధ్యాపకులు చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని ఉత్సాహంగా పాల్గొన్నారు.
ర్యాలీ సందర్భంగా విద్యార్థులు ‘భారత్ మాతా కీ జై’, ‘వందేమాతరం’ వంటి నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఎం. మోహనరావు మాట్లాడుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. యువత దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం. మోహనరావు, ఎంపీడీఓ సీహెచ్. ఈశ్వరమ్మ, ఎంఎస్జీఓ ఎం. శాంతకుమారి, అధ్యాపక సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాలతో సాగిన ర్యాలీతో సోంపేటలో దేశభక్తి వాతావరణం నెలకొంది.