కుక్కునూరు తహశీల్దార్ కార్యాలయం ముట్టడి.. భూముల నోటిఫికేషన్‌పై గిరిజన రైతుల ఆగ్రహం

ఏలూరు జిల్లా కుక్కునూరు మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయాన్ని సుమారు 200 మంది గిరిజన రైతులు గురువారం ముట్టడించారు. పోలవరం జిల్లా కూనవరం మండలం పెద్ద ఆర్కుర్ గ్రామ గిరిజన రైతులకు భూమికి భూమి కింద కేటాయిస్తున్న అర్వపల్లి భూముల నోటిఫికేషన్‌పై నెమలిపేటకు చెందిన గిరిజన రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

తరతరాలుగా తమ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని రైతులు తెలిపారు. అయితే కొంతమంది పెత్తందారులు అడ్డదారుల్లో పట్టాలు చేయించుకుని తమ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల అమాయక గిరిజన రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారంలో కొంతమంది అధికారులు కూడా పెత్తందారులకు వత్తాసు పలుకుతున్నారని రైతులు ఆరోపించారు. తమ భూములకు న్యాయం చేయాలని, వివాదాస్పద నోటిఫికేషన్‌ను పునఃపరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ హక్కులను కాపాడే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.